జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీదారు ఎంఐఎం అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. మొదటి స్థానంలో తెరాస ఉంటే... రెండో స్థానం మజ్లిస్‌దేనని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో తమకు లేని పొత్తును భాజపా నాయకులు అంటగడుతున్నారని మండిపడ్డారు. గ్లోబెల్స్ ప్రచారానికి కజిన్ బ్రదర్స్‌లా మారారని ఎద్దేవా చేశారు. అసత్య ఆరోపణలు, అర్ధసత్యాలు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలోని ముస్లింలపై భాజపాకు ఎంత విద్వేషం ఉందో తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. ఇటీవల కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేసిన ఛార్జిషీట్‌కు... 'తెరాస-ఎంఐఎం సర్కార్ వైఫల్యాలు' అనే పేరు పెట్టడం చూస్తే వారికున్న పరిజ్ఞానం ఏపాటిదో తెలుస్తోందని విమర్శించారు.