ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్: మేయర్​ అభ్యర్థిత్వంపై తెరాసలో ఎడతెగని ఉత్కంఠ - టీఆర్​ఎస్ వార్తలు

హైదరాబాద్ మేయర్, ఉప మేయర్ అభ్యర్థిత్వంపై తెరాసలో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. తెరాస సీల్డ్ కవర్​లో ఉండనున్న పేర్లపై పార్టీ వర్గాల్లో చర్చోపచర్చలు ఊపందుకున్నాయి. గద్వాల విజయ లక్ష్మి, విజయారెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, బొంతు శ్రీదేవి సహా దాదాపు అర డజను మంది మహిళ నేతలు మేయర్ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. ఉపమేయర్ అభ్యర్థిగా మైనారిటీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థికే ఓటేయాలని తెరాస విప్ జారీ చేసింది.

trs-will-take-decision
trs-will-take-decision

By

Published : Feb 11, 2021, 10:18 AM IST

హైదరాబాద్ మేయర్, ఉపమేయర్ ఎన్నిక ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ తెరాస కార్పొరేటర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుండటంతో.. తెరాస నాయకత్వం రెండు పదవులకు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తోంది. గురువారం ఉదయం ఎనిమిది వరకు కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులందరూ తెలంగాణ భవన్​కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం సమాచారం పంపింది. ఉదయం తొమ్మిది గంటలకు కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులతో కేటీఆర్ సమావేశం నిర్వహించి.. ఎన్నికకు సంబంధించి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తారు.

భాజపా, ఎంఐఎం పోటీలో నిలిస్తే..?

ఒకవేళ భాజపా, ఎంఐఎం పోటీలో ఉంటే ఏం చేయాలి, మిగతా పార్టీ అభ్యర్థులు బరిలో లేకపోతే ఎలా వ్యవహరించాలో స్పష్టతనిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులందరూ కలిసి జీహెచ్ఎంసీకి వెళ్తారు. అక్కడే సీల్డ్ కవర్ తెరిచి అభ్యర్థులను ప్రకటించేలా వ్యూహాన్ని ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని కార్పొరేటర్లకు, ఎక్స్అఫిషియో సభ్యులకు తెరాస ఇప్పటికే విప్ జారీ చేసింది. తెరాసకు 56 మంది కార్పొరేటర్లు, 32 మంది ఎక్స్అఫిషియో సభ్యుల బలం ఉంది. మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ అవసరం లేదని.. ఎవరికి ఎక్కువ మంది చేతులు లేపితే వారే గెలిచినట్లుగా ఎస్ఈసీ ఇప్పటికే స్పష్టతనిచ్చింది.

మేయర్​ పీఠం ఆశావహులు వీరే..!

ప్రయత్నాలు ముమ్మరం

మేయర్, ఉప మేయర్ పదవులు తెరాసకే దక్కడం ఖాయంగా కనిపిస్తుండటంతో... ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావటంతో.. ఆశావహుల పోటీ ఎక్కువగానే ఉంది. తెరాస తరఫున 27 మంది మహిళలు ఎన్నికయ్యారు. వీరిలో ప్రధానంగా ఏడెనిమిది మంది మేయర్ స్థానానికి ప్రధానంగా రేసులో ఉన్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్, మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయరెడ్డి, బంజారాహిల్స్ నుంచి మరోసారి కార్పొరేటర్​ గా ఎన్నికైన తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి, పటాన్​చెరు నియోజకవర్గం పరిధిలోని భారతీనగర్ కార్పొరేటర్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు సింధు ఆదర్శ్ రెడ్డి, చర్లపల్లి నుంచి ఎన్నికైన ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి, తార్నాక నుంచి గెలిచిన తెరాస సీనియర్ నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న మోతె శోభన్ రెడ్డి భార్య మోతె శ్రీలత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మైనారిటీకి డిప్యూటీ?

అల్వాల్ నుంచి మరోసారి గెలిచిన దివంగత ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్​గా ఎన్నికైన పార్టీ సీనియర్ నాయకుడు మన్నె గోవర్దన్ రెడ్డి భార్య కవిత కూడా మేయర్​ పదవికి ప్రయత్నిస్తున్నారు. మేయర్ స్థానం జవరల్ మహిళకు ఇస్తున్నందున .. డిప్యూటీ మేయర్ మైనారిటీ లేదా బీసీ,ఎస్సీ వర్గాలకు చెందిన పురుషులకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని రాజకీయ పరిస్థితులతో పాటు వివిధ సమీకరణలను తెరాస నాయకత్వం పరిశీలిస్తోంది. భాజపా బలమైన ప్రతిపక్షంగా ఉన్నందున పాలక వర్గం సమావేశాలను సమర్థంగా నిర్వహించగలిగే సామర్థ్యం, పార్టీ నాయకత్వం, సీనియర్ నాయకుల పట్ల విధేయత, కుల సమీకరణలు తదితర అంశాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details