తెలంగాణలో ఎన్నిక ఏదైనా... విజయం తమదేనని చెప్పుకునే తెరాస.. మినీ పురపోరులోనూ సత్తా చాటింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలను సునాయసంగా కైవసం చేసుకుంది. పక్కా ప్రణాళికలతో తెరాస విజయదుందుభి మోగించింది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కొంతకాలంగా ప్రత్యేక దృష్టి పెట్టిన తెరాస... అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి ఆకర్షించే ప్రయత్నం చేసింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిరంతరం స్థానిక నేతలతో సమాలోచనలు జరపుతూ సలహాలు ఇస్తూ.. ముందుకు నడిపారు. వ్యూహాలన్నీ ఫలించి విజయం చేకూరింది.
గులాబీల్లో రెట్టింపయిన ఉత్సాహం
మినీ పురపోరులో ఘన విజయంతో గులాబీ పార్టీలో ఉత్సాహం రెట్టింపయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కొంత నిరాశ చెందిన తెరాస శ్రేణుల్లో వరస విజయాలు కొత్త ఊపునిచ్చాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా.. జోరు కారుదే అన్న చందంగా కొనసాగుతోంది. ఒక్క దుబ్బాక ఉపఎన్నిక .. జీహెచ్ఎంసీలో కొంత హవా తగ్గినట్టు కనిపించినా మరోసారి మెరుపువేగంతో పుంజుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లోనూ వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానాన్ని నిలబెట్టుకోడంతో పాటు.. హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్లోనూ పాగా వేసింది.
తాజాగా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించింది. 24 గంటల వ్యవధిలోనే వెలువడిన మినీ పురపోరు ఫలితాల్లోనూ అదే జోరు కొనసాగించింది. కొత్తూరు పురపాలిక మినహా ఎక్కడా కూడా విపక్షాలు ఎదురు నిలవలేకపోయాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కొంతమేరకు పోటీ ఇవ్వగలిగారు. వరంగల్ కార్పొరేషన్‌లో భాజపా, ఖమ్మంలో కాంగ్రెస్ కొన్ని డివిజన్లను దక్కించుకోగలిగాయి.
జోరుగా ప్రచారం