కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్లో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేకపోగా.. తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిష్క్రియా రాజకీయాల వల్ల మోదీ ప్రభుత్వం, భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడిందని సీఎం పేర్కొన్నారు.
ఉద్యోగులకు సంఘీభావంగా
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి తద్వారా వాటిని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో జరిగిన తెరాస లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇంఛార్జీల సంయుక్త సమావేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అన్నింటిని మూసివేస్తున్నారు
నెహ్రూ ప్రజల మేలు కోసం ఎంతో దూర దృష్టితో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే.. మోదీ సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తోంది. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ప్రభుత్వరంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా మూడు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని భాజపా విధానాలను కొనసాగించింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించి.. వాటిని ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలకు అప్పగిస్తోంది. మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించక పోగా ఉన్న వాటిని మూసి వేసే ప్రయత్నం చేస్తోంది. దాని వల్ల అటు దేశానికి, ఇటు ప్రజలకు, మరోవైపు అందులో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది.
-ముఖ్యమంత్రి కేసీఆర్
వాటిని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముంది
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి.. ప్రైవేటు పరం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. సుమారు 65 వేల కిలోమీటర్ల నెట్వర్కుతో.. కోట్లాది మందికి సేవలు అందిస్తున్న.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద భారతీయ రైల్వే వ్యవస్థను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎల్ఐసీ లాభాలు గడిస్తే అది దేశానికి ఉపయోగపడుతుందని.. కానీ విదేశీ కంపెనీలు లాభాలు గడిస్తే దేశానికి ఏం లాభమో తెలియదని విమర్శించారు.