రాజ్యసభ స్థానాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో కసరత్తు మొదలైంది. మార్చి తొలి వారంలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ కోటాలో రెండు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో వేడి పెరిగింది. కేవీపీ రామచంద్ర రావుతోపాటు, గరికపాటి మెహన్రావుల పదవీ కాలం రాబోయే ఏప్రిల్ నెలతో ముగియనుంది.
మరోసారి సీటు ఆశిస్తున్న కేకే
తెరాస పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్, కె.కేశవరావు పదవీ కాలం ముగియనుంది. పార్టీ నాయకత్వం తనకు మరోసారి అవకాశం ఇస్తుందని కేకే ఆశిస్తున్నారు. మరోవైపు పలువురు సీనియర్ నేతలు రేసులో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరారు.
రేసులో మాజీ ఎంపీలు
రెండు స్థానాల్లో ఒకటి ఓసీలకు.. మరొకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఒక్కరికి కేటాయించాలని తెరాస నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. దానికి అనుగుణంగా రాజ్యసభ స్థానాలను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఆ కోణంలో మాజీ ఎంపీలు కవిత, వినోద్ కుమార్‌లలో ఒకరిని పెద్దల సభకు పంపడం ఖాయమేనని తెలుస్తోంది.
కె.కేశవరావు, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, బూర నర్సయ్య గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ సీనియర్ నేత బాలమల్లు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో వివిధ కోణాలను తెరాస నాయకత్వం పరిశీలిస్తోంది.
ఇవీ చూడండి: