ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

munugode bypoll: మునుగోడు తెరాస అభ్యర్థి... అతనివైపే కేసీఆర్ మొగ్గు! - తెరాసా మునుగోడు

munugode TRS Candidate Name: తెలంగాణలోని మునుగోడులో గులాబీ పార్టీ ప్రచారం మరింత ముమ్మరం కానుంది. ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించి.. తెరాసకు తిరుగులేదన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జరిగేలా కేసీఆర్ వ్యూహాలన్నీ సిద్ధం చేశారు. అభ్యర్థి ఎవరైనప్పటికీ కేసీఆర్, కారు గుర్తును చూసి ఓట్లేస్తారన్న సంకేతాన్ని పంపించే ఆలోచనతో కనిపిస్తోంది. తెరాస తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ.. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేటీఆర్, హరీశ్​ రావు వంటి అగ్రనేతలు సహా 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఇవాళో, రేపో గ్రామాల్లో దిగనున్నారు.

munugode bypoll
మునుగోడు తెరాస అభ్యర్థి

By

Published : Oct 7, 2022, 10:31 AM IST

Munugode TRS Candidate: మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ గా ప్రచారం జరుగుతున్న మునుగోడులో.. సత్తా చాటడం ద్వారా బలప్రదర్శన చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సీఎం కేసీఆర్ ఇమేజ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకొని బరిలోకి దిగనుంది.

అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఇప్పటికే తెరాస దాదాపు అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. స్థానికంగా ఇప్పటి వరకు మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే దుబ్బాక, హుజురాబాద్‌లో ఎదురుదెబ్బలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ.. ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది.

మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు రంగంలోకి దిగనున్నారు. కేటీఆర్​కు గట్టుప్పల్, హరీశ్​ రావు మర్రిగూడ గ్రామాల బాధ్యతలు కేటాయించారు. భాజపా తరఫున ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున.. పోలింగ్ పూర్తయ్యే వరకు హరీశ్​ రావు కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీశ్​ రావు సహా 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళో, రేపో నియోజకవర్గంలో దిగనున్నారు. సుమారు 2 వేల ఓటర్లకు ఒక కీలక నేతకు బాధ్యత అప్పగించారు.

తెరాస పేరు మార్పు, భారాస ప్రకటన అంశంపై ఇప్పటి వరకు నిమగ్నమైన కేసీఆర్.. ఇక పోలింగ్ ముగిసే వరకు మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గతంలో మునుగోడులో సభ నిర్వహించిన కేసీఆర్.. ప్రచార గడువు ముగిసే ఒకటి, రెండు రోజుల ముందు చండూరులో భారీ సభ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు.

తెరాసతో పాటు.. ప్రత్యర్థుల బలాబలాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ నివేదిక తెప్పించుకొని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని సర్వేలు తెరాసకే అనుకూలంగా ఉన్నప్పటికీ... ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వామపక్షల పొత్తు మునుగోడులో కచ్చితంగా లాభం చేకూరుస్తుందనే ఆశతో గులాబీ పార్టీ ఉంది. సీపీఐ , సీపీఎం ఓట్లన్నీ తెరాసకే బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెరాస, వామపక్షాల నేతలతో గ్రామస్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వామపక్ష పార్టీల ముఖ్య నేతలందరూ ప్రచారంలోకి దిగేలా వ్యూహ రచన చేస్తున్నారు. రైతుబంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో పాటు.. గట్టుప్పల్ మండలం ఏర్పాటు, గిరిజనుల రిజర్వేషన్ పెంపు, పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీలు, కొత్త పించన్లు వంటివి కచ్చితంగా లాభిస్తాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు మునుగోడులో ఆయారాం గయారాంల జోరు కనిపిస్తున్నందున.. పార్టీ క్యాడర్ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఇతర నాయకులు, కార్యకర్తలకు గాలం వేస్తున్నారు.

అభ్యర్థి ఎవరైనప్పటికీ కేసీఆరు, కారు గుర్తునే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న వ్యూహాన్ని మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు నేరుగా ప్రజలను కలుస్తున్నప్పటికీ.. తెరాస ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే తమ అభ్యర్థి అనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చింది. కూసుకుంట్ల ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించవచ్చునని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ నేత కర్నాటి ప్రభాకర్ తదితరులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మిగతా ఆశావహుల్లో ఒకరిద్దరు కొంత నిరాశగా ఉన్నప్పటికీ.. అది పెద్దగా ప్రభావం చూపదని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details