TRS MPs on Andhra Pradesh Bifurcation : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో భాజపా చెప్పాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. అన్ని పార్టీలూ మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 2/3 మెజార్టీ చూసిన తర్వాతే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని అన్నారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతోందన్న కేకే.. నాటి ఘటనను మోదీ ఇప్పుడెందుకు గుర్తు చేశారని నిలదీశారు. మోదీ తెలంగాణ ప్రజలను అవమానించారని మండిపడ్డారు. రాజకీయంగా భాజపా దిగజారిపోయిందని అన్నారు. లాఠీఛార్జ్, కాల్పులు వంటి ఘటనలు జరగకుండా రాష్ట్రం సాకారమైందని చెప్పారు.
రాష్ట్ర విభజన భావోద్వేగంతో కూడినది..
TRS MPs on Modi's Statement about AP Bifurcation : 'ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ సాకారమైంది. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. కీలక బిల్లుపై ఓటింగ్ జరిగితే సభ్యుల లెక్కింపు తప్పక జరగుతుంది. రాష్ట్ర విభజన బిల్లుకు భాజపా మద్దతు ఇచ్చింది. అధికార, విపక్ష పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు సంఖ్యాబలం సమస్య ఉత్పన్నం కాదు. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు ఆశాస్త్రీయం ఎలా అవుతుంది? ఝార్ఖండ్ బిల్లు ఆమోదం సమయంలో కొందరు సభ్యులు వాజ్పేయీ మీదకు దూసుకెళ్లారు. రాష్ట్రాల విభజన అనేది భావోద్వేగాలతో కూడినది.'
- కేకే, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత