బల్దియా ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ప్రచార హోరుతో హైదరాబాద్ నగరం దద్దరిల్లుతోంది. కేపీహెచ్బీ నుంచి భాజపా తెలంగాణ నేత రాజాసింగ్ రోడ్ షో నిర్వహించారు. బాలాజీనగర్ డివిజన్ వద్దకు రాజాసింగ్ బృందం చేరుకోగానే.. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న తెరాస నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.
భాజపా నాయకులు వెనక్కి వెళ్లిపోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తలను ఆయా పార్టీల నాయకులు సముదాయించగా గొడవ సద్దుమణిగింది. ప్రచార సమయంలో వెనక్కి వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేయడం సరికాదని పలువురు భాజపా నాయకులు అభిప్రాయపడ్డారు.