తరతరాలుగా అడవి తల్లితో పెనవేసుకున్న బంధం. నిండైన అమాయకత్వం... కపటమెరుగని మనస్తత్వం. ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ... ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఈ గిరిపుత్రుల బతుకులు.... వెలుగు చూడకుండానే తెల్లారుతున్నాయి. ఈ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది... తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆదివాసీ పల్లె. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే అసోదా గ్రామస్థులు... బాహ్యప్రపంచానికి తెలియని గోడును అనుభవిస్తున్నారు.
చికిత్స చేయించినా దక్కలేదు
చేతిలో చనిపోయిన భార్య ఫోటో పట్టుకుని బిడ్డల పక్కన ఆర్థ్రతతో కూర్చున్న ఇతని పేరు పర్చకి జ్యోతిరాం. ఇతని భార్య రత్తుబాయికి ఇటీవల ఉన్నట్టుండి తల, నరాల నొప్పితో అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆమెను ఇంద్రవెల్లి మండలంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుని దగ్గర చికిత్స చేయించినా... ఫలితం దక్కలేదు. అదే రోజు అర్ధరాత్రి ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. ఇదిలా ఉండగా... వంగిపోయిన నడుంతో నడవడమే కష్టంగా మారిన మరో యువతి దయనీయమిది. ఇలా... ఒక్కో కుటుంబానికి ఒక్కో దయనీయ గాథ... ఇక్కడి ఆదివాసీల జీవనవిధానానికి అద్దంపడుతోంది.
ఎలాంటి సౌకర్యాలు లేవు
దాదాపుగా ఏడు దశాబ్ధాల కిందటనే ఏర్పడిన అసోదా గ్రామంలో మొదట 40 కుటుంబాలు... 229 మంది జనాభాతో పక్కనున్న పిప్పల్‌ధరి పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు.. బుర్కి, పొన్నగూడ, బొప్పాపూర్ అనే అనుబంధ గ్రామాలు విలీనమై 559 మంది జనాభాతో నూతన పంచాయతీగా అవతరించింది. పంచాయతీగా ఏర్పడిందనే సంతోషమే కానీ ఎలాంటి మౌళిక సౌకర్యాలు ఈ గ్రామంలో సమకూరలేదు.