Drugs Case: మెట్రో నగరాల్లో ఏజెంట్లను నియమించుకొని.. వ్యాపారులే లక్ష్యంగా మాదకద్రవ్యాల దందా కొనసాగించిన టోనీని పోలీసులు లోతుగా విచారించారు. అతని వద్ద లభించిన ఫోన్ వాట్సాప్‌లో మెసెజ్‌లు డిలీట్ చేసి ఉండడంతో.. వాటిని తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో అతని కాల్‌డేటా ఆధారంగా విచారించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులతో తరచూ టచ్‌లో ఉన్న టోనీ.. వేడుకలకు వారు అడిగినంత మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లుగా గుర్తించారు. ఇందుకు కోడ్ భాషలను వాడి కొరియర్ బాయ్‌ల ద్వారా సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని మత్తు పదార్థాలను ఓయో హోటల్ గదుల్లో బసచేస్తూ సరఫరా చేసినట్లు బయటపడింది.
టోనీ కాల్ డేటా ఆధారంగా పరారీలో ఉన్న మరో ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏసీపీ నర్సింగ్‌రావు పీఎస్‌కు వచ్చి టోనీ వాంగ్మూలం నమోదు చేశారు. ఐదు రోజుల పాటు టోనీని విచారించిన పోలీసులు... ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. మరింత లోతుగా కేసును విచారించేందుకు టోనీని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది.