ఇటీవల గైనకాలజీ, జనరల్ ఫిజీషియన్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, ఇతర స్పెషాలిటీ విభాగాల్లో కొత్తగా 695 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నియామకాలను ఏపీవీవీపీ ద్వారా చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను అనుసరించి వైద్యులను ఎంపిక చేశారు. అయితే... కౌన్సెలింగులో అభ్యర్థి ఖాయం చేసుకున్న స్థానానికి పోస్టింగ్ ఇచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఉత్తర్వులను సవరిస్తూ మరోచోట ఇచ్చారు. ఇలా సుమారు 50 మందికి సవరణ ఉత్తర్వులు అందించారు. ఈ తీరు చర్చనీయాంశమైంది. ఇదే విషయమై వైద్య విధాన పరిషత్ కమిషనరు రామకృష్ణారావు మాట్లాడుతూ... ‘ఇప్పటివరకు 695 పోస్టుల్లో 210 పోస్టులను భర్తీ చేయగలిగాం. కొత్తగా వైద్యుల నియామకాలు చేపడుతున్నందునే హేతుబద్ధీకరణ చేపట్టాం. ఈ క్రమంలోనే వైద్యుల బదిలీలు, డిప్యుటేషన్లు జరిగాయి. కమిషనరుకు ఆ అధికారం ఉంది. కౌన్సెలింగ్‌లో పోస్టింగు పొందిన వారు విధుల్లో చేరకుండా ఉంటేనే... ఆయా స్థానాలను కోరుకున్న వారికి కేటాయిస్తూ సవరణ ఉత్తర్వులు ఇచ్చాం’ అని తెలిపారు.
*వైద్య విద్య సంచాలకుల కార్యాలయం (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆధీనంలోని బోధనాసుపత్రుల్లో చేపట్టిన వైద్యుల భర్తీ ప్రక్రియలోనూ సవరణ ఉత్తర్వులు ఇచ్చారు.