Transfers in health department: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో నెలాఖరులోగా సుమారు పది వేల మందిని బదిలీ చేయనున్నారు. ఒకేచోట పని చేస్తూ...ఐదేళ్లు దాటిన వారు తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధనతో వైద్యులతో పాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. బోధనాసుపత్రుల్లో కొందరు వైద్యులు గత 25 ఏళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతులు వచ్చినా నిరాకరిస్తూ అక్కడే పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ బదిలీ కానుంది. బదిలీకి అర్హత కలిగిన వారి నుంచి 20 ప్రదేశాలను కోరుకునేలా ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు ఈ జాబితా నుంచి తమ వారి పేర్లను తప్పించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని ఉత్తర్వులు ఉన్నందున తామేమీ చేయలేమని అధికారులు సమాధానమిస్తున్నారు.
39 వేల మందిలో 25% మందికి బదిలీ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అన్ని హెచ్‌ఓడీల్లో కలిపి సుమారు 39 వేల మంది శాశ్వత వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డ్రైవర్లు, ఇతర కేడర్లలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకేచోట పనిచేస్తూ ఐదేళ్లు దాటిన వారు 25% మంది ఉన్నారు. అలా... సుమారు పది వేల మంది సిబ్బందిలో వైద్యులు 3,500 మంది వరకు ఉంటారని అంచనా. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వీరిలో బోధనాసుపత్రుల్లో 1,200 మంది, వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులు, ఇతర చోట్ల 400 మంది, ప్రజారోగ్యశాఖలో 1,750 మంది, ఆయుష్‌లో 120 మంది వైద్యులు ఉన్నారు. ఆయా శాఖల్లో మరో 6500 మంది ఇతర సిబ్బందీ ఉన్నారు. గతంలో 20 శాతానికి మించకుండా సిబ్బందిని బదిలీ చేసేవారు. తాజా నిబంధనతో కర్నూలు, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి బోధనాసుపత్రుల నుంచి 200 మంది చొప్పున, విజయవాడ జీజీహెచ్‌లో 230 మందికి స్థానచలనం కలుగుతోంది. సొంత మండలం, రెవెన్యూ డివిజన్‌లో పనిచేయకూడదన్న నిబంధనను ఈ సారి కచ్చితంగా అమలు చేస్తున్నారు.