ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఆర్‌డీసీ) పేరిట రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తుల బదలాయింపు వెనుక భారీ ప్రణాళికలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రహదారుల అభివృద్ధి శాఖకు ఉన్న రూ.3,393.65 కోట్ల విలువైన 574.37 ఎకరాలు, అందులో ఉన్న రూ.392.50 కోట్ల విలువైన భవనాలను కార్పొరేషన్‌కు బదలాయించారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ) తరహాలోనే ఈ ప్రక్రియ సాగుతోంది. ఆ కార్పొరేషన్ ద్వారా రూ.వేల కోట్లు రుణం తీసుకువచ్చినట్లే ఈ భూములనూ తనఖా పెట్టి మరిన్ని రుణ ప్రణాళికలు రచించనున్నారని ఆర్థిక నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్, మే నెలలోనే రుణ ప్రతిపాదనలు
రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి రూ.3,000 కోట్ల రుణం తీసుకుంటామని, ఇందుకు ప్రభుత్వ హామీ అవసరమని రవాణాశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ గ్యారంటీల పరిమితి దాటిపోయినందున ఇక కార్పొరేషన్‌కు గ్యారంటీ ఇవ్వలేమని ఆర్థికశాఖ అధికారులు తేల్చిచెప్పారు. అప్పటికే దాదాపు 1.19 లక్షల కోట్లకు గ్యారంటీలతో పాటు పుస్తకాల్లో నమోదవని మరికొన్ని గ్యారంటీలు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో డీజిల్, పెట్రోలు సెస్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లీటరుకు రూపాయి చొప్పున సెస్ విధించి ఆ ఆదాయాన్ని చెల్లింపులకు ఆధారంగా చూపి రుణం తీసుకోవచ్చని సూచించారు. ఏడాదికి ఈ సెస్ రూపంలో రూ.700 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, ఇందులో రూ.370 కోట్లతో రుణాలు చెల్లించవచ్చని లెక్కించారు. ఆ సెస్ విధించి రూ.3,000 కోట్ల రుణం ప్రతిపాదించారు. అందులో రూ.1,100 కోట్లు తీసుకున్నారు. మిగిలినది తీసుకునేందుకు ఈ స్థాయిలో భూముల బదలాయింపు, తనఖా ప్రయత్నాలు అవసరం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.