కరోనా మందును తీసుకునేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకోకుండా నిలువరించాలని కోరుతూ... నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని డివిజన్ బెంచ్ వద్దకు బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఔషధ పంపిణీ వ్యహారంపై గతంలో ధర్మాసనం విచారణ చేసిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాన్ని అక్కడికే పంపడం ఉత్తమమని జస్టిస్ డి.రమేశ్ పేర్కొన్నారు.
ఆయుర్వేద మందు కోసం వస్తున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ ఆనందయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. గతంలో కొన్ని రకాల మందు పంపిణీకి అధికారులు అడ్డు చెప్పడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ తర్వాత ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. ప్రస్తుతం మందు కోసం వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు.