విద్యుత్ బకాయిలపై ఆంధ్రప్రదేశ్ వాదనలు తెలంగాణ తోసిపుచ్చింది. ఏపీ విద్యుత్ సంస్థలే తమకు రూ.4,457 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి తమకు రావలసిన బాకీలను చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఏపీ జెన్‌కో హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. అందుకు సమాధానంగా సీఎండీ ప్రభాకరరావు ప్రకటన విడుదల చేశారు.
ఆ విషయంపై మాట్లాడడం లేదు
ఏపీ జెన్‌కో నుంచి తెలంగాణ కొనుగోలు చేసిన కరెంటుకు రూ.4,887 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ చెబుతోందన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన ఇతర బకాయిల విషయంపై మాట్లాడడం లేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న రుణాలు రూ.2,725 కోట్లు... తెలంగాణ చెల్లిస్తోందన్నారు. అలాగే ఏపీ జెన్‌కోలో పెట్టుబడులు, వాటాల విభజనలో తెలంగాణ జెన్‌కోకు రూ.3,857 కోట్లు రావాల్సి ఉందన్నారు.