ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుమారుల ముందే ఉరేసుకున్న తండ్రి - Kamareddy district news

సులువుగా డబ్బులు వస్తాయన్న ఆశ.. గొలుసుకట్టు కంపెనీలో నగదు కట్టి మోసపోవడం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. చనిపోతున్నానంటూ కన్న కుమారులిద్దరికీ వీడియోకాల్‌ చేసి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆ కుటుంబంలో అంతులేని వేదనను మిగిల్చింది.

father died
కుమారులు ముందే ఉరేసుకున్న తండ్రి

By

Published : Jan 25, 2021, 10:04 AM IST

కుమారులు ముందే ఉరేసుకున్న తండ్రి

‘నాన్నా.. వద్దు నాన్నా..’ అంటూ చిన్నారులు విలపిస్తూ ఎంత వేడుకున్నా ఆ తండ్రి నిర్ణయాన్ని మార్చుకోలేదు. చక్కగా ఉండాలని, బుద్ధిగా చదువుకోవాలని వీడియోకాల్‌లో కుమారులతో మాట్లాడుతూనే తనువు చాలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేట్‌కు చెందిన మంగళపల్లి లక్ష్మణ్‌, లక్ష్మీ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు తిరుపతి, ఈశ్వర్‌. లక్ష్మణ్‌ ఎలక్ట్రీషియన్‌ కాగా... భార్య ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. ఉద్యోగం నిమిత్తం వారు కామారెడ్డిలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు.

అప్పులు తెచ్చి...

ఆరు నెలల క్రితం లాటరీలో నగదు గెలుచుకున్నట్లు లక్ష్మీ సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశాలు వచ్చాయి. నగదు పంపాలంటే కొంత మొత్తం చెల్లించాలంటూ సైబర్‌ నేరగాళ్లు అందులో పేర్కొన్నారు. అప్పులు తెచ్చి మరీ రెండు విడతల్లో రూ. 2లక్షల 65వేలు కట్టారు. కొన్ని రోజుల తర్వాత గొలుసుకట్టు తరహా బీర్షేబా కంపెనీలోనూ విడతలవారీగా రూ. 2 లక్షలు కట్టారు.

మనో వేదనకు గురై...

తీరా ఎంతకీ నగదు రాకపోవడం వల్ల మోసపోయామని గ్రహించి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం వల్ల లక్ష్మణ్‌ ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గురువారం స్వగ్రామం పోసానిపేటకు వెళ్లారు. అక్కడ ఉరేసుకొనే ముందు కామారెడ్డిలో ఉన్న పిల్లలకు వీడియోకాల్‌ చేసి మాట్లాడారు. వారు చూస్తుండగానే వద్దని వేడుకుంటున్నా బలవన్మరణానికి పాల్పడ్డారు.

మోసాలు...

గొలుసుకట్టు సంస్థ మోసాలకు జిల్లాలో ఇటీవల పలువురు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యే మాచారెడ్డి మండలంలోనూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కంటికి రెప్పలా కాపాడాల్సినవారే కాటేశారు

ABOUT THE AUTHOR

...view details