ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి క్రికెట్‌ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు - ఉప్పల్ క్రికెట్ స్టేడియం తాజా సమాచారం

Traffic restrictions in Hyderabad: హైదరాబాద్​ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పకడ్బందీగా తనిఖీలు చేసి క్రికెట్ అభిమానులను లోపలికి పంపించనున్నారు. అటు క్రీడాభిమానుల కోసం మెట్రోరైళ్లు ఒంటిగంటవరకు అందుబాటులో ఉండనుండగా... ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

Traffic restrictions
క్రికెట్‌ మ్యాచ్

By

Published : Sep 24, 2022, 7:57 PM IST

Traffic restrictions in Hyderabad: మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు హైదరాబాద్​ ఉప్పల్ క్రికెట్ స్టేడియం అతిథ్యం ఇవ్వనుండటంతో అభిమానులు ప్రత్యక్ష వీక్షణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. 40వేల మందికి పైగా కూర్చునే సామర్థ్యం స్టేడియానికి ఉంది. భారీగా ప్రేక్షకుల రాక దృష్ట్యా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండున్నర వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అభిమానులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించనున్నారు. ప్రేక్షకుడి వెంట కేవలం మొబైల్ మాత్రమే అనుమతిస్తారు. అగ్నిమాపక సిబ్బంది, వైద్యఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. జేబు దొంగలు, పోకిరీల పని పట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. షీటీం మఫ్టిలో విధులు నిర్వహించనున్నారు.

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించారు. వాహనాలను స్డేడియానికి ఎడమ వైపున పార్కింగ్-బీలో నిలపాల్సి ఉంటుంది. స్టేడియానికి వచ్చేందుకు ప్రత్యేక పాసులు కలిగి ఉన్న వాళ్లకి పాత ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా 4 వేలకు పైగా కార్లు, 5వేలకు పైగా ద్విచక్ర వాహనాలు నిలిపి ఉంచేలా సమీప ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. క్రికెట్ అభిమానులు ప్రజారవాణానే విస్తృతంగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు.

తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ, ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకొని వాహనాలను ఏ, సీ ల వద్ద నిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అంబర్ పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్, స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీ ల వద్ద నిలపాలని సూచిస్తున్నారు. నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. క్రికెట్ అభిమానులు వాహనాలు తీసుకొని వస్తే వచ్చే దారిలో సూచించిన పార్కింగ్ స్థలాల్లోకి వెళ్లి వాహనాలను నిలిపే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై ఇతర వాహనాలను అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మ్యాచ్ ముగియగానే వీలైనంత తొందరగా ట్రాఫిక్ అంక్షలు ఎత్తేస్తామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి ఒంటి గంటవరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆర్టీసీ ఉప్పల్‌ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను తిప్పనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details