ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉప్పొంగిన చింతలచెరువు.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. కురిసింది కాసేపే అయినా.. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వానకు.. పలు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్​లోని చింతలచెరువు ఉప్పొంగడం వల్ల హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అలుగుపారిన చింతలచెరువు.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
అలుగుపారిన చింతలచెరువు.. విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

By

Published : Sep 5, 2021, 10:37 AM IST

తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వానకు అబ్దుల్లాపూర్‌మెట్​​లోని చింతలచెరువు నిండి పొంగిపొర్లుతోంది. విజయవాడ జాతీయ రహదారి మీదుగా ఇనాంగూడ వద్ద బాట చెరువు అలుగు పారుతోంది.

బాట చెరువు ఉప్పొంగడంతో విజయవాడ హైవే మీదకు నీరొచ్చి.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి వల్ల వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల జోక్యంతో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

చెరువు కింద ఉన్న వరి పంట నీటమునిగింది. కొద్దిరోజుల క్రితమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి నాట్లు వేశామని.. ఇప్పుడు వరి పంటంతా నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. బాటసింగారం నుంచి మజీద్​పూర్​కు వెళ్లే దారిలోని వాగు, లష్కర్​గూడ వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఈ వాగుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details