కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. అందరూ ఇళ్లలో సేదతీరుతుంటే పోలీసులు మాత్రం మండే ఎండలో రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. మహమ్మారి సోకుతుందనే భయాన్ని కూడా లెక్కచేయక తమ విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఓ వైపు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూస్తూనే.. మరోవైపు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ మానవత్వం చాటుకుంటున్నారు. తమవంతు చేతనైనంత సాయం చేస్తున్నారు.
హైదరాబాద్ పంజాగుట్టలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేశ్.. సోమాజిగూడలో రోడ్డుపై ఉన్న ఇద్దరు పిల్లల్ని చూశారు. ఆకలితో అలమటిస్తున్న ఆ పిల్లలు.. కనిపించిన ప్రతివారిని ఏడుస్తూ అడుక్కోవడం గమనించారు. ఆ దృశ్యం చూసి గుండె కరిగిన మహేశ్.. ఇంటి నుంచి తాను తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ను వారికి అందించారు. అంతేకాకుండా.. ప్రేమతో వారికి వడ్డించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. సెల్యూట్ పోలీస్, శెభాష్ మహేశ్, హ్యాట్సాఫ్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.