ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ పీసీసీపై ఉత్కంఠ: సమ ప్రాధాన్యం.. సముచిత స్థానం - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ పదవుల భర్తీకి ఏఐసీసీ కసరత్తు కొనసాగుతోంది. 'సమ ప్రాధాన్యం.. సముచిత న్యాయం' ప్రాతిపదికన పీసీసీ అధ్యక్ష, ఇతర పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. పీఠం కోసం పలువురు సీనియర్లు పోటీపడుతున్నందున.. నేతల మధ్య సమన్వయమే లక్ష్యంగా అధిష్ఠానం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే సమప్రాధాన్య సూత్రాన్ని అమలుచేయటంపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.

tpcc-president
tpcc-president

By

Published : Dec 26, 2020, 9:14 AM IST

తెలంగాణ పీసీసీపై ఉత్కంఠ: సమ ప్రాధాన్యం.. సముచిత స్థానం

‘సమ ప్రాధాన్యం.. సముచిత న్యాయం’ ప్రాతిపదికగా పీసీసీ అధ్యక్ష, ఇతర పదవులు భర్తీ చేసేందుకు ఏఐసీసీ రంగం సిద్ధం చేస్తోంది. పీసీసీ పీఠం కోసం పలువురు నేతలు పోటీపడుతున్న నేపథ్యంలో సీనియర్ల మధ్య సమన్వయం సాధించడమే లక్ష్యంగా సమప్రాధాన్య సూత్రాన్ని అమలు చేయడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో కొత్త సారథి నియామకానికి ఏఐసీసీ శ్రీకారం చుట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు మాణికం ఠాగూర్‌ డీసీసీ అధ్యక్షులు సహా ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని ఇప్పటికే పార్టీ పెద్దలకు నివేదిక అందజేశారు. నేతల అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. పలువురు తమకే ఇవ్వాలని కోరగా.. ఇంకొందరు ఫలానా వారికి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

2023, 24 ఎన్నికలే లక్ష్యం..

2023 శాసనసభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ రాష్ట్ర సారథిని ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కూడా రాష్ట్ర నేతలకు ప్రాధాన్యం ఇస్తూనే వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. కొత్తగా వచ్చిన వాళ్లకు కాకుండా పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్నవారికే ఇవ్వాలని కొందరు ఏఐసీసీని కోరారు. మరోవైపు పార్టీని డైనమిక్‌గా ముందుకు తీసుకెళ్లేవారికే అవకాశం ఇవ్వాలని కొందరు విన్నవించినట్లు తెలిసింది. మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. వివిధ సమీకరణాల నేపథ్యంలో.. సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. సీనియారిటినే కాకుండా వివిధ అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్ర నేతల అభిప్రాయాలను అధిష్ఠానానికి నివేదించడమే తమ బాధ్యతని ఏఐసీసీ బాధ్యులు ఒకరు స్పష్టం చేశారు.

ముంబయి ప్రాంతీయ కమిటీ నేపథ్యం..

అందరు ముఖ్యనేతలకు ప్రాధాన్యమిస్తూ అన్ని వర్గాలు, సీనియర్‌ నాయకులకు సముచిత స్థానం కల్పించేలా పీసీసీ అధ్యక్షుడు సహా ఇతర కీలక పదవుల నియామకాలపై ఏఐసీసీ దృష్టిసారించింది. ‘సమష్టి నాయకత్వం.. సమష్టి బాధ్యత’ అంశాన్ని ముందుకు తీసుకొస్తోంది. గత వారం ముంబయి ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీని ఇదే ప్రాతిపదికగా ఏఐసీసీ నియమించింది. పీసీసీ అధ్యక్షుడు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రచార కమిటీ, సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీ అధ్యక్షులతో పాటు పలువురికి కార్యవర్గంలో అవకాశం కల్పించింది. ఇదే సూత్రం టీపీసీసీలో అమలుపై కూడా పరిశీలన జరుగుతోంది.

ఇంకా రాహుల్‌, సోనియాలతో చర్చించ లేదు..

పీసీసీ అధ్యక్షుడి నియామకం అంశంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీలతో ఇంకా చర్చ జరగలేదని.. వివిధ ప్రతిపాదనలను వారి ముందుంచే ప్రయత్నం చేస్తున్నట్లు ఏఐసీసీ బాధ్యులు ఒకరు తెలిపారు. ఈ నియామకం పార్టీకి నష్టం కలిగించేలా మాత్రం ఉండదన్నారు. అవసరమైతే మరోమారు ముఖ్యనేతలను దిల్లీకి పిలిపించి చర్చించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో అధికార తెరాసతోపాటు భాజపాతోనూ తలపడాల్సి ఉంటుందని.. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియమాకంలో ఇంకా కాలయాపనతో పార్టీకి నష్టమని పలువురు రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ఇప్పటికే వివరించారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా నియామకాలు చేపట్టాలనే లక్ష్యంతోనే ఏఐసీసీ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి

ABOUT THE AUTHOR

...view details