Revanth Reddy fires on Trs and Bjp: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి తనదైన శైలిలో భాజపా, తెరాసలపై విమర్శల వర్షం కురిపించారు. గులాబీ కూలీ పేరున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపిస్తున్న కేసు నిర్దారణ అయితే తెరాస పార్టీని రద్దు చేయాల్సి వస్తుందని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భాజపా, తెరాస మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని భాజపా చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రేవంత్ ధ్వజమెత్తారు.
కేసీఆర్‌పై కేంద్రం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. సీబీఐ, ఈడీలు తమను వేధిస్తున్నాయని కేటీఆర్ చెబుతున్నారని.. తెలంగాణలో భాజపా, తెరాస మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు కేసీఆర్ దోపిడీని ప్రస్తావిస్తున్నా.. అదే వాస్తవమైతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే గులాబీ కూలీ పేరుతో రాష్ట్రంలో వందలాది కోట్లు వసూళ్లు చేసిన వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో తాను సంపూర్ణ వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని పేర్కొన్నారు. 2018లో కేంద్ర ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చిందని వివరించారు.
'గులాబీ కూలీ పేరుతో సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారు. దిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? భాజపా, తెరాస మధ్య ఎలాంటి పంచాయితీలు లేవు. కాంగ్రెస్‌ను లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. భాజపా, తెరాస మధ్య వైరుధ్యం ఉన్నట్లు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి జైలులో వేస్తామని భాజపా చెబుతోంది. సీబీఐ, ఈడీ.. తమను వేధిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారు.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు