తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెలంగాణ కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోకాపేట భూముల వద్దకు తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానే ఆ భూముల సందర్శనకు పిలుపునిచ్చింది.