- పీసీసీ అధ్యక్షుడిగా మీ లక్ష్యం ఏమిటి?
తెలంగాణ సాధన కోసం 1,200 మంది విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ల ఆశయాలు నెరవేరలేదు. ఇప్పుడున్నది ప్రజా తెలంగాణ కాదు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకోడానికి అవకాశం లేదు. ఏఐసీసీ అధ్యక్షురాలు ఏ సదుద్దేశంతో రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఆకాంక్షలు నెరవేర్చడం మా పార్టీ లక్ష్యం. అద్భుతమైన అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నిబద్ధతతో పని చేస్తాం. ప్రజలు ఆ అవకాశం ఇస్తారని భావిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాం. బస్సుయాత్రా, పాదయాత్రా అని కాదు సమష్టిగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం.
- ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు?
నాయకుల్లో గందరగోళం, కార్యకర్తల్లో భయం ఉన్నాయి. పార్టీ మారినవాళ్లు ఆస్తులు, పదవులు సంపాదించుకుంటున్నారని.. తాము పార్టీలో ఉండి నష్టపోతున్నామేమో అని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అక్రమ కేసులు, దాడులతో లొంగదీసుకునే ప్రయత్నాల వల్ల కార్యకర్తలు భయపడుతున్నారు. వీటన్నిటిపై దృష్టి సారించి నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తాం.
- పార్టీలో అంతర్గత విభేదాలపై మీ అభిప్రాయం?
కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు టీకప్పులో తుపానే. అన్నీ సర్దుకుంటాయి. పీసీసీపై నిర్ణయం రాకముందు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. నిర్ణయం జరిగాక 95 శాతం మంది ఏఐసీసీ అధ్యక్షురాలి నిర్ణయాన్ని గౌరవించారు. ఒకరిద్దరు మాట్లాడినా సర్దుకుంది. అందరం కలసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం.
- వరుస ఓటములతో నిస్తేజంతో ఉన్న పార్టీ శ్రేణులను ఎలా ముందుకు తీసుకెళ్తారు?
అందరినీ ఉత్తేజపరిచి సమస్యలపై పోరాటానికి సిద్ధంచేస్తాం. సమూలమైన మార్పులు తెచ్చి పార్టీని ముందుకు నడిపిస్తాం. తెలంగాణ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే తెలంగాణ తల్లి, ప్రతి ఇంట్లో ఆమె ఫొటో పెట్టుకోవాలి. ప్రజలకు కాంగ్రెస్ ద్వారానే మేలు జరుగుతుంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన ఈ మూడు అంశాల ప్రాతిపదికన ప్రజల దగ్గరకు వెళ్తాం. సమష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తాం.
- రాష్ట్రంలో ప్రస్తుతం మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమిటి?
ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లు ఇతర ప్రాంతాల వారు తరలించుకుపోతున్నారు. నిధులను సీఎం కేసీఆర్ కుటుంబం కొల్లగొడుతోంది. నియామకాలూ వాళ్ల చేతిలోనే ఉన్నాయి. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయింది. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా, సంక్షేమం ప్రజల్ని సంతోషపెట్టవు. వారు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు నిధులు, రాజకీయ పదవుల్లో న్యాయబద్ధమైన వాటా కోరుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు కూడా జనాభా ప్రాతిపదికన అవకాశాలను కోరుకుంటున్నారు. ప్రజలు సంక్షేమ పథకాల కోసం గులాములుగా మారరు.
- తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం మేమే అని భాజపా అంటోంది?