వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ విత్తన డీలర్లను బెదిరించడం రైతులను బ్లాక్మెయిల్ చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) అభిప్రాయపడ్డారు. వరి రైతుల బాధ్యత నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. వరి పంట వేయనప్పుడు కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణాలు ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా.. ఊరుకోను అని కలెక్టర్ నియంతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎవరైనా విత్తనాలు అమ్మితే.. ఆ పరిధిలోని అధికారులను విధుల్లో నుంచి తొలగిస్తానని కలెక్టర్ వెంకటరామిరెడ్డి(siddipet collector Venkat rami reddy) హెచ్చరించారని రేవంత్ తెలిపారు. సుప్రీంకోర్టుకన్నా.. కలెక్టర్ గొప్పవాడా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే.. వరి రైతులపై ప్రభుత్వం కార్యాచరణను స్పష్టం చేయాలని కోరారు.
"జిల్లాలో వరి విత్తనం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరితో ఫోన్ చేయించినా.. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా.. ఊరుకోను. అలా చేస్తే మూణ్నెళ్లు ఆ దుకాణం మూసివేస్తాం. జిల్లాలో ఉన్న 350 దుకాణాల్లో కిలో వరి విత్తనాలు విక్రయించినా.. దుకాణం మూసివేస్తాం. నేను కలెక్టర్‌గా ఉన్నంత వరకు ఆ దుకాణం మూసివేసే ఉంటుంది. అది కాకుండా ఇంకే వ్యాపారం చేసినా ఊరుకోను. అందుకే విత్తన డీలర్లెవరు వరి విత్తనాలు విక్రయించొద్దు."
- వెంకటరామిరెడ్డి, సిద్దిపేట కలెక్టర్
జిల్లాలో యాసంగి సీజన్‌లో ఒక్క ఎకరంలోనూ వరి సాగు కావొద్దని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా పాలనాధికారి వెంకటరామరెడ్డి(siddipet collector Venkat rami reddy) సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు.. రైతులను కలిసి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చైతన్యం కలిగించాలని చెప్పారు. వేరుశనగ, పెసర, శనగ, నువ్వులు, సజ్జలు, ఇతర నూనె పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్లు వరి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దన్నారు.
- ఇదీ చదవండిViveka Murder Case: ఐదారు సంచుల్లో పత్రాలు.. త్వరలోనే సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం..!