భేషజాలు లేకుండా తాను పని చేస్తానని, నిన్నటి వరకు చూసిన రేవంత్ రెడ్డి వేరని పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఇంట్లో పీసీసీ కమిటీ సభ్యులు తేనీటి విందు పేరుతో సమావేశమయ్యారు. సోనియా, రాహుల్ గాంధీలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రికెట్ జట్టు మాదిరిగా సమష్ఠిగా పని చేద్దామని సహచర సభ్యులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కుటుంబమే..
కాంగ్రెస్ చరిత్రలో 4రోజులపాటు అభిప్రాయ సేకరణ చేసి పీసీసీ నియామకం చేయడం ఇదే మొదటి సారని, తాను సోనియా గాంధీ మనిషినని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమది ముందు నుంచి కాంగ్రెస్ కుటుంబమని, స్థానిక పరిస్థితులు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని పేర్కొన్నారు. మనస్పూర్తిగా కాంగ్రెస్‌లోకి వచ్చానని, తక్కువ సమయంలో పార్టీ ఎక్కువ పదవులు ఇచ్చిందని రేవంత్ గుర్తుచేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి కార్యనిర్వాహక అధ్యక్షులు జె.గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్ గౌడ్‌లతోపాటు సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, నిరంజన్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ తదితరులు హాజరయ్యారు.