ఆదర్శవంతమైన, పారదర్శకమైన తెలంగాణ కోసం యువతకు విశ్వసం కల్పించేందుకే మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరినట్టు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc chief Revanth Reddy) స్పష్టంచేశారు. హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిషేధించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ (drugs free telangana) అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.
స్వచ్ఛందంగా నిరూపించుకుందాం
మరోవైపు రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను (revanth reddy White challenge) స్వీకరించినకొండా విశ్వేశ్వరరెడ్డి... గన్‌పార్క్ వద్దకు వెళ్లారు. దీన్ని మంత్రి కేటీఆర్ కూడా స్వీకరించి వస్తే బాగుండేదని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వైట్ ఛాలెంజ్ విసురుతునట్టు తెలిపారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ వాడట్లేదని స్వచ్ఛందంగా నిరూపించుకుందామన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో డ్రగ్స్ వ్యాపారాల్లో పెద్దల హస్తం ఉంది. అకున్ సబర్వాల్‌ను సిట్ అధికారిగా నియమించారు. విచారణ మధ్యలో అకున్ సబర్వాల్‌ను బదిలీ చేశారు. డ్రగ్స్ అమ్మకాలకు పబ్‌లు కేంద్రాలుగా మారాయి. పబ్‌ల వెనుక ఇతర రాష్ట్రాలు, దేశాల శక్తులు ఉన్నాయి. చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించాలని చెప్పాం. ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది. డ్రగ్స్‌పై 2017లో హైకోర్టులో పిల్ దాఖలు చేశాను. విచారణ చేయించి చర్యలు తీసుకునే బాధ్యత కేటీఆర్‌కు లేదా?