AP Tourism: రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్న పలు పర్యాటక ఆస్తులు ప్రైవేట్‌పరం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను అప్పనంగా కట్టబెట్టనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్ కోర్టులను ప్రైవేట్ సంస్థలకు కనిష్ఠంగా 5 ఏళ్లు, గరిష్ఠంగా 20 ఏళ్లపాటు లీజుకి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏపీటీడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఒక జాతీయ బ్యాంకు ఆర్థిక సాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, కాటేజీలను ఆధునీకరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వీటన్నింటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతికి అందించేందుకు పావులు కదుపుతోంది.
కడపలోని హరిత హోటల్‌లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే 2,767 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నారు. సిద్దవటంలో రెస్టారెంట్, గండికోటలో 15 టెంట్లు, కిచెన్, రెస్టారెంట్‌కి టెండర్ పిలిచారు. శ్రీసత్యసాయి జిల్లా వెంకటాపురంలోని హోటల్, కర్నూలులో బ్యాంకెట్ హాలు, తిరుపతి జిల్లా తడలోని రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాలు, బీవీ పాలెంలో బార్, 15 ఉడెన్ కాటేజీలు, రెస్టారెంట్, ఇసకపల్లిలో రెస్టారెంట్, బార్ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే జిల్లాలోని కొత్త కోడూరు, ఉదయగిరి, రామతీర్థంలోని రెస్టారెంట్లు కూడా లీజుకి ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించారు.