రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు - రాష్ట్రంలో 40కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
11:05 March 31
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారని ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.
ప్రకాశం-11, గుంటూరు-9, విశాఖపట్నం-6, కృష్ణా-5, తూర్పుగోదావరి-4, అనంతపురం-2, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు ఒక్కో కేసు నమోదయ్యాయి.
దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని, వారితో కలిసిన వారి వివరాలను ఆరా తీస్తున్నామని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు చెప్పారు. గుంటూరు కొత్తపేటలోని జళగం రామరావు స్మారక పురపాలక పాఠశాలలో వలస కూలీలు, అన్నార్తులకు నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారికి అల్పాహారం, దుప్పట్లు పంపిణీ చేసిన ప్రభాకరరావు.. స్వీయక్రమశిక్షణ, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. దిల్లీ నుంచి.. గుంటూరు జిల్లాకు వచ్చిన 79 మందిని, ప్రకాశం నుంచి 83 మందిని, నెల్లూరు నుంచి 103 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించామన్నారు. ఇంకా ఆచూకీ లభించని వారి కోసం అన్వేషణ సాగిస్తున్నామని చెప్పారు.