ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. ఎన్ని స్థానాల్లో అంటే!

రేపటి రెండో దఫా పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. 13 జిల్లాల్లోని 167 మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రచారపర్వం ముగియగా, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక నాలుగో విడత నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది.

ఏపీ పంచాయతీ ఎన్నికలు
ap local polls 2021

By

Published : Feb 12, 2021, 8:22 AM IST

రాష్ట్రంలో రేపు రెండో దఫా పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సమయం సమీపించింది. 13 జిల్లాల్లో 3వేల 328 పంచాయతీలు, 33వేల 570 వార్డులకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా.... 539 పంచాయతీలు, 12వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2 వేల 786 పంచాయతీలు, 20 వేల 796 వార్డుల్లో శనివారం పోలింగ్ నిర్వహించనున్నారు. సర్పంచి స్థానాలకు 7వేల 510 మంది, వార్డులకు 44 వేల 879 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం, కళ్యాణదుర్గం డివిజన్లలో శనివారం పోలింగ్‌ జరుగనుంది. 292 పంచాయతీల్లో 756 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కల్యాణదుర్గం పరిధిలో 3 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రకాశం జిల్లాలో అద్దంకి, దర్శి, మార్కాపురం, కొండెపి నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 69 పంచాయతీలు ఏకగ్రీవమవగా.. మిగిలిన 208 చోట్ల 555 మంది పోటీలో నిలిచారు. దర్శి పరిధిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వర్గాలు తమ మద్దతుదారులను గెలిపించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బల్లికురవ మండలం కొత్తూరులో సర్పంచి అభ్యర్థి భర్త, తెలుగుదేశం నాయకుడు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో కలెక్టర్ పోలా భాస్కర్‌, ఎస్పీ సిద్దార్ధ కౌశల్ గ్రామాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో కలెక్టర్ వివేక్ యాదవ్, రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పర్యటించారు. నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఎన్నికల అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

జోరుగా నామినేషన్ల పర్వం....

నాలుగో విడత నామినేషన్ల పక్రియ జోరుగా సాగుతోంది. రెండో రోజూ రిటర్నింగ్‌ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలంలో అతితక్కువ మంది నామినేషన్లు వేశారు. 23 పంచాయతీలకు 28 మంది మాత్రమే ఇప్పటిదాకా బరిలో నిలిచారు. సత్యవేడులో 160 పంచాయతీలకు 610 నామినేషన్లు పడ్డాయి. శ్రీకాళహస్తిలో 121 పంచాయతీలకు 462, చంద్రగిరి పరిధిలోని రెండు మండలాల్లో 172, తిరుపతి గ్రామీణ పరిధిలో 34 మంది నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్‌లో రెండో రోజు హుషారుగా నామినేషన్ల కార్యక్రమం సాగింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో కోలాహలంగా నామినేషన్ల పక్రియ సాగింది.

ఇదీ చదవండి

పారిశుద్ధ్య కార్మికురాలిగా.. గ్రామ ప్రథమ మహిళ

ABOUT THE AUTHOR

...view details