రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఐకాస నేతలు శనివారం విరామం(break of amaravati farmers padayatra at tomorrow) ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నిడమనూరు గ్రామ పంచాయతీలో 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక(by-poll) జరగనుంది. ఫలితంగా పాదయాత్ర జరపరాదని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారి ఆదేశాలను గౌరవిస్తూ.. పాదయాత్రకు ఐకాస నేతలు విరామం ప్రకటించారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది. రైతులు ఇవాళ(శుక్రవారం), రేపు(శనివారం) అక్కడే బస చేయనున్నారు. తిరిగి ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభం(sunday morning) కానుంది. రైతుల పాదయాత్ర నిడమనూరు చేరుకునే సమయానికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఐకాస నేతలు తెలిపారు.
అడుగడుగునా ఘనస్వాగతం...
నేడు ఒంగోలులో బృందావన కళ్యాణ మండపం నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పోలీసుల పహారా నడుమ యాత్ర కొనసాగుతోంది. రైతులకు.. ప్రజలు అడుగడుగునా పూలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రైతుల పాదయాత్రకు స్థానికులే కాకుండా సమీప గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై అమరావతి అనే నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సందడిగా సాగుతోంది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న రైతుల డిమాండ్‌కు ప్రకాశం జిల్లా ప్రజలు మద్దతు పలికారు. ఇవాళ్టి పాదయాత్రలో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.