ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుప్రీంలో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ.. బెంచ్​ మార్పు - ap sec latest news

supreme-court
సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ

By

Published : Jan 24, 2021, 3:04 PM IST

Updated : Jan 25, 2021, 1:20 AM IST

15:02 January 24

జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ధర్మాసనానికి మారిన విచారణ

సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికల కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్ ధర్మాసనం వాదనలు విననుంది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ప్రభుత్వ పిటిషన్ ఉన్నప్పటికీ... తరువాత జస్టిస్ సంజయ్‌కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్‌ బెంచ్​కు బదిలీ అయింది. విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 

అసలేం జరిగింది.... 

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్​ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పు వెలువరించే క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  

 ఈ నెల 8న ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సమ్మతం తెలిపింది. పంచాయతీ ఎన్నికలు, ప్రజారోగ్యం రెండూ ముఖ్యమేనని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు అనుమతిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు ఆపేందుకు సహేతుక కారణాలు లేవన్న హైకోర్టు.. రాజ్యాంగంలోని 9, 9‍(A) షెడ్యూల్ ప్రకారం కాలపరిమితిలోగా ఎన్నికలు తప్పనిసరని స్పష్టం చేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని తేల్చిచెప్పింది. ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం ఎస్ఈసీదేనన్న హైకోర్టు.. సీఈసీకి ఉన్న అధికారాలే ఎస్ఈసీకి ఉన్నాయని తెలిపింది.

సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఎస్​ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని సూచించింది. ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్​ను ముందుకు తీసుకువెళ్తారని చెప్పింది. వ్యాక్సినేషన్ పేరుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా కోరడంలో సహేతుకత లేదంది. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపు ఎన్నికలు నిర్వహణ సబబేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అమెరికాతోపాటు మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించిన అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ప్రభుత్వం....

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, టీకా కార్యక్రమం కొనసాగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈనెల 11న ఉత్తర్వులు జారీచేసింది. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీలు చేయగా సీజే జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏకసభ్య ధర్మాసనం తీర్పును కొట్టేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం 37 పేజీల తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 5.09 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

కేవియట్ దాఖలు చేసిన ఎస్​ఈసీ...

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్​కు ఎన్నికల కమిషన్ కేవియట్ వేసింది. సర్కార్​ వేసిన పిటిషన్​ను విచారించే సమయంలో తమ వాదనలు కూడా వినాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఎస్​ఈసీ కోరింది. ఆ తర్వాతే ఉత్తర్వులివ్వాలని పిటిషన్​లో అభ్యర్థించింది. ఈ మేరకు గురువారం కేవియట్​ పిటిషన్​ను ఎస్‌ఈసీ దాఖలు చేసింది. ప్రభుత్వ దాఖలు చేసిన ఎస్​ఎల్​పీతో పాటు కేవియట్​పై రేపు సుప్రీంకోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందనే ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి

సిద్ధంగా ఉన్న అధికారులతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: వెంకట్రామిరెడ్డి

Last Updated : Jan 25, 2021, 1:20 AM IST

ABOUT THE AUTHOR

...view details