Auto-Cabs Bundh: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. గిరాకీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటే... ఫిట్‌నెస్ లేట్ ఫీజు పేరుతో వాహనదారులపై రోజుకు రూ. 50 వసూలు చేయడంపై ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వాటికి అదనంగా తమపై ఫిట్‌నెస్ భారం మోపుతున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీఏ కార్యాలయం ముందు నిరసన: గురువారం ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రవాణాశాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల యూనియన్ జేఏసీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. అనంతరం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేపడుతామన్నారు. ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీలతో పాటు అన్ని లారీ, క్యాబ్, ఆటో యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు. ఫిట్‌నెస్ చేయించుకోని వాహనదారులకు రోజుకు రూ.50ల జరిమానా విధిస్తున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖ విధిస్తున్న రూ.50ల పెనాల్టీనీ ఆటో, క్యాబ్, లారీ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.
కొత్త వాటికి పర్మిట్లు ఇవ్వాలి: హైదరాబాద్ నగరంలో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో, క్యాబ్ మీటర్ రేట్లు పెంచాలని, అంతరాష్ట్ర సరిహద్దుల్లో సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికే వాహనాల లైఫ్ ట్యాక్స్‌ను పెంచారని వాపోయారు. గ్రీన్ ట్యాక్స్‌ను భారీగా పెంచారని... దీనికి తోడు ఈఎంఐలు పెరిగిపోయాయని ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. రోజుకు రూ.50 జరిమానా విధించడంతో అద్దెకు నడుకుపుకుంటున్న వారిపై అధనపు భారం పడుతుందని వాపోతున్నారు. ఒకవైపు పెరిగిన డీజీల్ ధరలతోనే ఆర్థికంగా చితికిపోతున్నామంటే... ఫిట్‌నెస్ లేదని రోజుకు రూ.50 విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.