Allu arjun Donation : ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను ఊహించని వరదలు ముంచెత్తాయి. కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తును చవిచూసింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా వందల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు.
ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా.. మేమున్నామని అండగా నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తమ వంతుగా విరాళం అందించారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వంతు సహాయం అందించారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం తనవంతు సహాయంగా రూ.25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.