ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయులపై మరుగుదొడ్ల పరిశుభ్రత ఒత్తిడి - ఏపీ 2021 వార్తలు

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత విషయంలో ఏరోజుకారోజు పాఠశాలలకు రేటింగ్‌లు కేటాయిస్తోంది. కమోడ్‌, ఫ్లోర్‌ ఎలా ఉందో యాప్‌లో అప్లోడ్‌ చేసే ఫొటోలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా గుర్తించి గుడ్‌, బ్యాడ్‌ అని అదేరోజు రేటింగ్‌లు ఇస్తోంది. ఈ విషయంపై ఉపాధ్యాయవర్గం భగ్గుమంటోంది.

toilet-hygiene-pressure-on-teachers
ఉపాధ్యాయులపై మరుగుదొడ్ల పరిశుభ్రత ఒత్తిడి

By

Published : Oct 29, 2021, 9:23 AM IST

ఉపాధ్యాయుల బోధనకు రేటింగ్‌లు ఇస్తే సంతోషించేవాళ్లం. అందుకు విరుద్ధంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రేటింగ్‌లు ఇవ్వటంపై ఉపాధ్యాయవర్గం భగ్గుమంటోంది. గత కొద్దిరోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత విషయంలో ఏరోజుకారోజు పాఠశాలలకు రేటింగ్‌లు కేటాయిస్తోంది. కమోడ్‌, ఫ్లోర్‌ ఎలా ఉందో యాప్‌లో అప్లోడ్‌ చేసే ఫొటోలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా గుర్తించి గుడ్‌, బ్యాడ్‌ అని అదేరోజు రేటింగ్‌లు ఇస్తోంది. ఇది ప్రధానోపాధ్యాయుల్లో గుబులు రేకెత్తిస్తోంది. వాటి నిర్వహణ బాగోకపోతే ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ జారీ చేసి దానికి కారణాలు కోరుతోంది. దీంతో ఉపాధ్యాయులు వాటిని చూసి బెంబేలెత్తుతున్నారు.

ఓ పాఠశాలలో మరుగుదొడ్డి..

మరుగుదొడ్ల విషయంలో ప్రభుత్వం రాజీపడటం లేదు. వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఒక్క మరకకు తావు లేకుండా స్టార్‌ హోటళ్లలో మాదిరి పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తోంది. అయితే సర్కారీ పాఠశాలల్లో ఇలా ఉంచటం అసాధ్యమని, చాలా వరకు ఇవి ఏళ్ల క్రితం నిర్మించిన దొడ్లు కావటంతో కమోడ్లు విరిగిపోయి, ఫ్లోరింగ్‌ పెచ్చులూడి కళావిహీనంగా ఉంటాయి. కొత్తవి నిర్మించి వాటి పరిశుభ్రత విషయంలో చెబితే బాగుండేదని ఉపాధ్యాయవర్గం అభిప్రాయపడుతోంది. జిల్లాలో 3650 పాఠశాలల్లో నాడు-నేడు మొదటి దశ పూర్తయిన సుమారు 1100 పాఠశాలలు మినహా మిగిలిన పాత స్కూళ్లకు చాలా వరకు బ్యాడ్‌ కండీషన్‌ అని వస్తున్నాయని, అందుకు నిత్యం సమాధానాలు రాయలేక సతమతమవుతున్నామని ఉపాధ్యాయవర్గం ఆవేదన చెందుతోంది. మెజార్టీ పాఠశాలల్లో దశాబ్దంన్నర క్రితం, అంతకు ముందు నిర్మించినవే ఉన్నాయి. వాటిల్లో మరకలు లేకుండా తళతళ మెరవటం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం సగటున ప్రతి పాఠశాలలో ఇదో పెద్ద టాస్క్‌గా తయారైందని, చదువు చెప్పటం కన్నా వీటికి ప్రాధాన్యమివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. బాగోలేదని యాప్‌లో వచ్చే టిక్కెట్లకు సమాధానమివ్వకపోతే ప్రతిరోజూ పెడింగ్‌ అని చూపుతుంది. దానిపై ఎంఈఓ, డీఈఓల నుంచి కాల్స్‌ వస్తాయని చెబుతున్నారు. సగటున ఉన్నత పాఠశాలల్లో 500 నుంచి వెయ్యి మందికి పైగా పిల్లలు ఉన్న పాఠశాలలు జిల్లాలో అనేకం ఉంటాయి. అదే ప్రాథమికోన్నత అయితే 300-400 మధ్య పిల్లలు ఉంటారు. ప్రాథమిక పాఠశాలల్లో 150 నుంచి 250 మంది వరకు ఉంటారు. ఇన్ని వందల మంది నిత్యం వినియోగించుకునే మరుగుదొడ్లలో కొద్దిపాటి లోపాలు లేకుండా నిత్యనూతనంగా మెరిపించాలంటే మావల్ల కాదని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వీటి నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు తక్కువే. ఆ తక్కువ వ్యయాలతో మెరుగ్గా నిర్వహణ అసాధ్యమని వాటి బడ్జెట్‌ పెంచాలని కోరుతున్నారు.

నిర్వహణకు సరిపడా గ్రాంట్లు ఏవీ?

ట్యాబ్‌ హైరిజల్యూషన్‌ లేకపోయినా, మరుగుదొడ్డిలో నీడ పడినా, వెలుతురు సక్రమంగా లేకపోయినా దొడ్డి నిర్వహణ సక్రమంగా లేనట్లు బ్యాడ్‌ అని వస్తోందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకుడు తిరుమలేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన మూడు, నాలుగేళ్ల నుంచి ఎస్‌ఎస్‌ఏ గ్రాంట్లు అరకొరగా వస్తున్నాయన్నారు. ఆయాలకు బిల్లులు పేరుకుపోవటం, సరిపడా నిదులు ఇవ్వకపోవటంతో వాటి నిర్వహణ కష్టంగా ఉంటోందన్నారు.

వృత్తిని కించపర్చొద్దు..

చదువు తప్ప మిగిలిన బోధనేతర పనులు చేయమనటం సరికాదని ఏపీటీఎఫ్‌ నాయకుడు బసవలింగరావు అన్నారు. నాన్‌ టీచింగ్‌ ఉపాధ్యాయులో లేదా సచివాలయ ఉద్యోగులకో ఆ బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల స్కూళ్లలో ఏకోపాధ్యాయులే దిక్కు. వీరెవరూ బోధన చేసే పరిస్థితి లేదన్నారు.

మరుగుదొడ్లకు ప్రాధాన్యం పెంచారు..

నాణ్యమై బోధన చేయాలని ఒత్తిడి తేవాల్సిన ఉన్నతాధికారులు తమ చేతుల్లో లేని మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా చేపట్టాలని సూచించటం అత్యంత ఘోరమని యూటిఎఫ్‌ నాయకుడు కళాధర్‌ ఆవేదన చెందారు.

ఇదీ చూడండి:అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details