polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి నదీ మార్గం మళ్లించే ఆకృతి (లే అవుట్) సోమవారం దాదాపు ఖరారు కానుంది. పోలవరం వద్ద నదిలో భూభౌతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్పిల్ వేను నదీ మార్గంలో కాకుండా పక్కనున్న కొండలపై నిర్మించారు. ఈ క్రమంలోనే అక్కడ గోదావరి నదిని మళ్లిస్తున్నారు. నదిని మళ్లించడం వల్ల ఏర్పడే పరిణామాలు, స్పిల్ వేపై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఇప్పటికే అధ్యయనాలు జరిగాయి. వాటి ఆధారంగా సోమవారం పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ(డీడీఆర్‌పీ) సమావేశం ఈ అప్రోచ్ ఛానల్‌ను ఖరారు చేయనుంది. చాలా రోజుల తర్వాత నిర్వహిస్తున్న ఈ సమావేశంలో డ్యాం డిజైన్లకు సంబంధించి కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
వచ్చే నెల 8, 9 తేదీల్లో ఈ కమిటీ ప్రాజెక్టును సందర్శించి మరోసారి సమావేశం నిర్వహించనుందని తెలిసింది. ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్ బండ్‌కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. డ్యాంలో స్పిల్ వే నిర్మాణంలో భాగంగా నదీ ప్రవాహాలు, ఒత్తిడి తదితర అంశాలను లెక్కించే యంత్ర పరికరాలపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం వాటి పూర్తి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సరిపోదని, ఇంకా నీరు నిలబెట్టకపోవడం, తలుపులు పని చేయించకపోవడం వల్ల రాబోయే రోజుల్లో స్పష్టతకు రావాలని జల సంఘం నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మించే చోట ఎడమ వైపున పురుషోత్తపట్నం వద్ద కొంత మేర నది కోత పడింది. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ సమావేశం చర్చించబోతోంది.