రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే కోసం నిర్దేశించిన ‘'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష' పథకం నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి రీసర్వే పూర్తి చేశారు. ఇక్కడ పొలాలల్లో సరిహద్దు రాయి పాతి... సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుడతారు. అనంతరం జగ్గయ్యపేటలో నిర్వహించే బహిరంగసభలో సీఎం పాల్గొంటారు.
తక్కెళ్లపాడులో రీ సర్వేను ప్రయోగాత్మకంగా చేపట్టగా...వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రం మొత్తం విస్తరిస్తారు. సమగ్ర సర్వేకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేశారు. జిల్లాల కలెక్టర్లు ఉచిత రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్ ఇచ్చి... తేదీల వారీగా ఏయే గ్రామాల్లో జరుగుతుందనే వివరాలు ప్రకటిస్తారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఇంత భారీ ఎత్తున భూముల రీ సర్వే చేయడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో కొలతలు కచ్చితంగా ఉంటాయని, తేడా చాలా సూక్ష్మస్థాయిలో 2 సెంటీ మీటర్లకు అటూ ఇటూ మాత్రమే ఉంటుందంటున్నారు. కార్స్ పరిజ్ఞానం, డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సదుపాయాలను ఈ సర్వే కోసం వినియోగిస్తారు.
విడతల వారీగా....
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేస్తారు. తొలి విడతలో 5 వేలు, మలివిడతలో 6వేల 500, మూడో విడతలో 5వేల 500 గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. తొలి విడతకు నోటిఫికేషన్లను వెంటనే జారీచేయనున్నారు. తొలిదశ సర్వే 2021 జులై వరకు జరగనుండగా.... 2021 ఆగస్టు నుంచి మొదలయ్యే మలిదశ సర్వే.. 2022 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. మూడో దశ సర్వే...2022 జులై నుంచి మొదలై 2023 జనవరికి పూర్తవుతుంది. మొదటి విడత పూర్తయి రెండో విడత ప్రారంభమయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ప్రత్యేక సంఖ్యతో కార్డు...
గత వందేళ్లుగా నమోదుకాని సబ్ డివిజన్లు, పంపకాలనూ రికార్డుల్లోకి ఎక్కిస్తారని.... పొలాల్లో సరిహద్దు రాళ్లు వేస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సంఖ్యతో రైతుకు ఒక కార్డు ఇస్తామంటున్నారు. దానిలో క్యూఆర్ కోడ్ ఉంటుందని..హార్డ్ కాపీ కూడా అందిస్తామంటున్నారు. రికార్డులన్నీ డిజిటల్ రూపంలోకి మార్చి... గ్రామాలకు సంబంధించిన మ్యాపులూ అందుబాటులోకి తెస్తామంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వే రికార్డులు ఉంచి... అక్కడే రిజిస్ట్రేషన్, సమీకృత రెవెన్యూ సేవలు అందిస్తామని చెబుతున్నారు.