రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాన్ని చూస్తే.. దేశభక్తి ఉప్పొంగుతోంది. సమైక్యతారాగం నినదిస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో మహోన్నత పోరాటాలకు ప్రతీకగా నిలిచిన ఆ జెండా రూపొందించి.. నేటితో వందేళ్లు పూర్తయ్యాయి. 1921 మార్చి 31న విజయవాడలో జాతిపిత మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు.. పింగళి వెంకయ్య కేవలం 3 గంటల్లోనే పతాకాన్ని రూపొందిచడం విశేషం. నగరంలోని విక్టోరియా జూబ్‌లీ మ్యూజియం సమావేశ మందిరంలో గాంధీ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలోనే మహాత్మడు.. పింగళికి పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన తన అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో కేవలం 3 గంటల్లోనే పతాకాన్ని తయారుచేశారు.
ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా అందులో ఉంది. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ.. ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ ముస్లింలకు, తెలుపు ఇతర మతాలకు ఉండేలా పతాకన్ని మార్చాలని సూచించగా... ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు మధ్యలో రాట్నంతో జాతీయపతాకాన్ని సిద్ధం చేశారు. 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ఈ మార్పును కాంగ్రెస్ జాతీయ మహాసభ ఆమోదించింది.
బీజం పడింది అప్పుడే...
పతాక రూపకల్పనకు బీజం 1906లోనే పడింది. 1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు నిర్వహించగా.... ప్రారంభానికి ముందు బ్రిటీష్ వారి పతాకమైన యూనియన్ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి కలత చెందారు. ఈ క్షణంలోనే మనకు ప్రత్యేక జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మదిలో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తంచేయగా.. ఆయనను కాంగ్రెస్ విషయ నిర్ణయ సమితి సభ్యుడిగా నియమించారు. తర్వాత పతాక ఆవశ్యకతను వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆ తర్వాత జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు వ్యత్యాసం ఉండాలని.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయపతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకచక్రాన్ని ముద్రించారు.