మేస్రం వంశీయుల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర గురువారం అర్ధరాత్రి తెలంగాణలో వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీల పండుగగా పేరొందిన నాగోబా జాతర... ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో సంప్రదాయ పూజలతో మొదలైంది. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి మేస్రం వంశీయులు మహాపూజ నిర్వహించారు.
సంప్రదాయ వాయిద్యాల నడుమ మహాపూజ కనుల పండువగా కొనసాగింది. ఈ పూజకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్‌తోపాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. మహాపూజ అనంతరం ప్రత్యేక హారతిని భక్తుల నడుమకు తీసుకొచ్చారు. మహాపూజలో పాల్గొనేందుకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మేస్రం వంశస్తులు తరలివచ్చారు.
తలకు పాగా ధరించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను తిలకించారు. తొలత మేస్రం వంశీయులు ఆ తర్వాత అధికారులు సంప్రదాయబద్ద పూజలు చేసి జాతర ప్రారంభమైనట్లు ప్రకటించారు. మహాపూజ ముగిశాక కొత్త కోడళ్లను పరిచయం చేసే బేటింగ్ కార్యక్రమం కొనసాగించారు.