Breakup Pain : ప్రేమికులు లేదా దంపతుల అభిప్రాయాల్లో తేడా వచ్చినప్పుడు అయ్యే బ్రేకప్ ఆ ఇద్దరి మనసులను కుంగదీస్తుంది. దీన్నుంచి బయటపడి తిరిగి జీవితాన్ని ఎలా ప్రారంభించాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.
వ్యక్తిగతంగా..బంధంలో ఉన్నప్పుడు ఎదుటివారి కోసం తమను తాము మార్చుకుంటూ, సర్దుకుంటూ వెళుతుంటారు. బ్రేకప్ అయినప్పుడు తమ కోసం తాము తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాలి. వ్యక్తిగత పనులకు ప్రాముఖ్యతనిచ్చుకోవాలి. మనసులో కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి సొంతంగా తమకుతాము సాయం చేసుకోవాలి. ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. విడిపోయిన వ్యక్తితో అన్నిరకాల బంధాలను దూరంగా ఉంచాలి. వారిని సోషల్‌మీడియాలోనూ అన్‌ఫాలో అవ్వాలి.
ఇతరులతో..ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులు, స్నేహితులు, పెద్దవాళ్ల చేయూత తీసుకోవాలి. అలాకాకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడితే క్రమేపీ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మనసులో ఆందోళనను స్నేహితులు లేదా శ్రేయోభిలాషులతో పంచుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. వారందించే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తే విడిపోయిన భావన నుంచి బయటపడొచ్చు.