Old City riots in Hyderabad: ఇవాళ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలు, పాతబస్తీలో భారీగా పోలీసులు మోహరించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను నిన్న రాత్రి ఏడు గంటలకే మూసేయించారు. పోలీసులు గస్తీ వాహనాలతో పహారా కాస్తున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు ఎవ్వరినీ అనుమతించడంలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చార్మినార్ నాలుగు దిక్కులా.. బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఎంఐఎం డిమాండ్ మేరకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ పెట్టడంతో పాటు, రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. జుమ్మా సందర్బంగా చేసే నమాజ్‌ను శాంతియుతంగా చేసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం సోదరులకు సూచించారు. నమాజ్ తర్వాత అందరూ ప్రశాంతంగా వెళ్లిపోవాలన్నారు. ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి ఘటనలకు పాల్పడినా.. హైదరాబాద్ పేరు చెడిపోతుందన్నారు.