ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆవాసం కోసం పెద్దపులి అన్వేషణ - tiger Wandering in Eturnagaram

ఆవాసం కోసం ఓ పెద్దపులి అన్వేషిస్తోంది. తెలంగాణలోని ఏటూరునాగారం ఆభయారణ్యంలో నెలరోజులపాటు సంచారం చేసింది. తాజాగా మంచిర్యాల అడవుల వైపు ప్రయాణం ప్రారంభించింది.

tiger-wandering-at-eturnagaram-forest-area-in-mulugu-district
ఆవాసం కోసం పెద్దపులి అన్వేషణ

By

Published : Sep 7, 2020, 11:11 AM IST

ఓ పెద్దపులి ఆవాసం కోసం అన్వేషిస్తోంది. ఇందుకు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. 18 ఏళ్లుగా పులుల జాడ లేని తెలంగాణలోని ఏటూరునాగారం అభయారణ్యానికీ వచ్చింది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో నెల రోజుల పాటు తిరిగింది. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంచిరామి పురేడిగుట్ట నుంచి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడెడ్‌, అడవిశ్రీరాంపూర్‌ గ్రామాల మానేరు పరీవాహక ప్రాంతం మీదుగా.. ఇదే మండలంలోని కొయగుట్ట అడవిలోకి పులి వచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు. అనంతరం మంచిర్యాల జిల్లా ప్రాణహిత అభయారణ్యం పరిధిలోని శివ్వారం వైపు ప్రయాణం ప్రారంభించింది. పులి అడుగు జాడలను బట్టి దాని వయసు 4 సంవత్సరాలు ఉంటుందని పెద్దపల్లి డీఎఫ్‌వో రవిప్రసాద్‌ తెలిపారు.

ఇప్పటివరకు 700 కి.మీ. ప్రయాణం

అనువైన ఆవాసప్రాంతం దొరక్కపోతే పులులు వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తాయి. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో తిరిగిన పులి మంచిర్యాల వైపు వెళ్తోందని.. ఇది మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వు నుంచి వచ్చి ఉంటుందని ఓ నిపుణుడు తెలిపారు. కొత్త ఆవాసాన్ని వెతుక్కునే క్రమంలో పెద్దపులి రోజుకు 40-50 కి.మీ. ప్రయాణిస్తుందని భూపాలపల్లి డీఎఫ్‌ఓ పురుషోత్తం తెలిపారు. ‘తడోబా’ నుంచి ఏటూరునాగారం దాదాపు 350 కి.మీ. దూరం. అక్కడి నుంచి వచ్చి అటూఇటూ తిరుగుతూ ఏటూరునాగారం అభయారణ్యానికి రావడం.. ఇప్పుడు మంచిర్యాల వైపు ప్రయాణం వరకు లెక్కేస్తే 700 కి.మీ. వరకు ప్రయాణించి ఉంటుందని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వచ్చిన పెద్దపులి కెమెరా ట్రాప్‌కి చిక్కితే.. ఎక్కడి నుంచి వచ్చిందో కచ్చితంగా గుర్తించగలం’ అని వరంగల్‌ సీసీఎఫ్‌ అక్బర్‌ ‘ఈనాడు- ఈటీవీభారత్​’కు చెప్పారు.

ఆవాసం ఏర్పర్చుకోవాలంటే..

పెద్దపులి 20 నుంచి 50 చ.కి.మీ. ప్రాంతం పరిధిలో తన ఆవాసం ఏర్పర్చుకుంటుంది. ఆ ప్రాంతంలో ఆహారం కోసం తగిన సంఖ్యలో జింకలు, మనుబోతులుండాలి. చిక్కటి అటవీ, తాగునీటి వనరులుండాలి. మనుషుల రాకపోకలుండొద్దు.

ఇవీ చూడండి: ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలి: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details