ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహమ్మారి మద్యం.. చేస్తోంది బతుకులు ఛిద్రం..! - natorious incidents due to alcohol driniking news

కన్న కొడుకునే కిరాయి హంతకులతో హత్య చేయించిన తల్లి... భర్తను చీరతో ఉరేసి చంపిన భార్య... మామపై కత్తితో దాడి చేసి చంపేసిన అల్లుడు. ఇవన్నీ ఏ పగతోనో, కుటుంబ కలహాలతోనో, ఆర్థిక వివాదాలతోనో జరిగినవి కావు. ఈ దారుణాలన్నింటికీ మూల కారణం మద్యం మహమ్మారి. నిత్యం మద్యం తాగి వచ్చి తమను వేధిస్తున్నారనే కారణంతో సొంతవారే.. అయినవారిని కడతేరుస్తున్నారు. ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యం మహమ్మారిపై ప్రత్యేక కథనం..!

మహమ్మారి మద్యం.. చేస్తోంది బతుకులు ఛిద్రం..!
మహమ్మారి మద్యం.. చేస్తోంది బతుకులు ఛిద్రం..!

By

Published : Aug 14, 2020, 10:14 PM IST

Updated : Aug 15, 2020, 12:22 AM IST

రాష్ట్రంలో మద్యం మహమ్మారి కారణంగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే మూడు వేర్వేరు చోట్ల మద్యం వల్ల మూడు కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. మద్యం తాగి వేధింపులకు గురి చేస్తున్న వారిని సొంతవారే దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.

కన్నపేగునే బలి చేసింది

దుర్వ్యసనాలకు బానిసైన కొడుకు.. నిత్యం మద్యం తాగి వచ్చి తనను వేధించడాన్ని ఆ తల్లి భరించలేకపోయింది. కుమారుణ్ని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది. ప్రకాశం జిల్లా పొన్నలూరులో జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో తల్లి సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మామను చంపిన అల్లుడు

మద్యం కారణంగా కర్నూలు జిల్లా నంద్యాలలో మరో దారుణం జరిగింది. మామ నిత్యం తాగి వచ్చి.. తనను దూషిస్తున్నాడని.. అల్లుడు(కూతురు భర్త) అతనిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ హత్యకు భార్య, అత్త సైతం సహకరించారు. చివరకు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు యత్నిస్తూ.. పోలీసులకు పట్టుబడ్డారు.

భర్తను ఉరేసింది

తాగి వచ్చి నిత్యం తనను వేధిస్తోన్న భర్తను చీరతో గొంతు బిగించి చంపేసింది ఆ భార్య. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడు పాలెంలో ఈ దారుణం జరిగింది. ఈ హత్యకు అత్త కూడా సహకరించింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది క్షేత్రస్థాయిలో అమలయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. కొన్నిచోట్ల మద్యం దొరక్క శానిటైజర్​లు తాగి చనిపోయిన ఘటనలు సైతం అధికమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మద్యం మహమ్మారిని పూర్తిగా అంతం చేస్తే తప్ప ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు.

ఇదీ చూడండి..

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం...తండ్రి కడచూపు దూరం

Last Updated : Aug 15, 2020, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details