తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు(Telugu Academy scam news). భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్‌ను అరెస్టు చేశారు. నిందితుల్లో సురభి వినయ్.. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి పీఏగా పనిచేశారు. రమణారెడ్డి ప్రధాన నిందితుడు సాయికి అనుచరుడిగా ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిలో భూపతికి ఎఫ్‌డీఐల నకిలీ పత్రాలతో సంబంధముందని సీీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. అరవైనాలుగున్నర కోట్ల కుంభకోణం కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు .. ఆధారాలను రాబడుతున్నారు. కొట్టేసిన డబ్బును నిందితులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. మనీలాండరింగ్‌కు ఏమైనా పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
రంగంలోకి ఈడీ..
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు (Telugu Academy Case) కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా... తాజాగా తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో ఈడీ రంగలోకి దిగింది. రూ.కోట్ల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
జనవరి నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయి. ఎఫ్‌డీలను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్ సొసైటీకి మళ్లించగా... కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లనూ మళ్లించారు. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లను కొల్లగొట్టిన నిందితులు... వాటితో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించి రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని ఎప్పుడు, ఎలా సొంతానికి వాడుకున్నారన్న అంశాలను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు సేకరించారు. గోల్‌మాల్ సూత్రధారి సాయికుమార్ రూ.20 కోట్లు తీసుకోగా... ఏపీ మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి తక్కువ ధరకే డీజిల్ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చానని, అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్టు సమాచారం. కమీషన్లు తీసుకొని ఆ సొమ్ముతో ఫ్లాట్లు కొన్నామని, కొంత నగదు ఉందని వెనక్కి ఇచ్చేస్తామని యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన చెప్పినట్లు తెలిసింది. తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని మరో నిందితుడు డాక్టర్ వెంకట్ చెప్పినట్టు తెలిసింది. కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయని సంయుక్త కమిషనర్ (నేర పరిశోధన) అవినాష్ మహంతి చెప్పారు. డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేస్తామని ఈడీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి
డ్రగ్స్ కేసుపై మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు