బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వాడిన చరవాణులు, వాహనాల నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కిడ్నాప్ ఘటనలో నిందితులు 6 సిమ్ కార్డులు వాడినట్లు సీపీ వెల్లడించారు. అపహరణ సమయంలో వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు బిగించారన్నారు. ప్రవీణ్ సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియ ఏ-1 నిందితురాలిగా ఉన్నారని చెప్పారు.
‘‘ నిందితులు మల్లిఖార్జున్‌రెడ్డి, మాదాల శ్రీను పేర్లతో సిమ్‌కార్డులు కొన్నారు. ఈ సిమ్ నంబర్‌ను అఖిలప్రియ కూడా ఉపయోగించారు. ఆమె అనుచరుడు సంపత్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశాం. అపహరించే ముందు నిందితులు రెక్కీ నిర్వహించారు. అఖిల ప్రియ సూచన మేరకే ప్రవీణ్‌రావు ఇంటి వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారు. ఈ సమాచారాన్ని భార్గవరామ్, గుంటూరు శ్రీనుకు ఇచ్చారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆమె కిడ్నాపర్లతో తరచూ మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయి. కిడ్నాపర్ల నెంబర్ నుంచి ఆమెకు కూడా కాల్స్ వెళ్లాయి. అపహరణ జరిగిన రోజు రాత్రి కిడ్నాపర్లు డీసీపీకి ఫోన్ చేసి, ప్రవీణ్ సోదరులు ముగ్గురినీ వదిలేస్తున్నట్లు చెప్పారు.’’ అని అంజనీకుమార్ వెల్లడించారు. నిందితులు పోలీసులపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారని అన్నారు. ఈ సందర్భంగా నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మ్యాప్ ద్వారా చూపించారు.