తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో సాధారణ పడకపై చికిత్స పొందే రోగికి మూడు పూటలా ఆహారం అందించేందుకు ప్రస్తుతం ఇస్తున్నది కేవలం రూ.40. ప్రత్యేక శస్త్రచికిత్సలు పొందినవారికైతే ‘హైప్రొటీన్’ ఆహారానికి ఒక్కో పడకకు ఇచ్చేది రూ.56. రెండు కేటగిరీలకూ ఇందులోనే ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తున్నారు. ప్రస్తుతం నిత్యావసరాలు, కూరగాయలు ధరలు పెరిగిన నేపథ్యంలో.. కేవలం రూ.40తో రోగికి మూడు పూటలా ఆహారం ఇవ్వడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో కప్పు అన్నం, సాంబారు, కూర, అరటిపండు, కోడిగుడ్డు, రాత్రి భోజనంలో అన్నం, సాంబారు, కూర, రెండు కోడిగుడ్లు ఇవ్వాలనేది నిబంధన. హైప్రొటీన్ ఆహారమైతే పాలు, పాలకూర పప్పు, మరో కోడిగుడ్డు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్యశాఖ పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. టెండర్లలో దీన్ని దక్కించుకోవడానికి గుత్తేదార్లు రూ.40 కంటే తక్కువ ధరకే ఆహారం సరఫరాకు ముందుకొస్తున్నారు. దీంతో ఆహార పంపిణీలో నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది.
నిధులు నేరుగా ఇవ్వాలి
రోగుల ఆహారం సహా పలు వ్యయాలకు సంబంధించి నిధుల కేటాయింపును పెంచాలంటూ వైద్యఆరోగ్యశాఖ ఇటీవల మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేసింది. సాధారణ పడకలో రోగి ఆహారానికి రూ.80.. హైప్రొటీన్ ఆహారానికి రూ.112 చొప్పున ఇవ్వాలని, వైద్యులకు ప్రస్తుతం కేటాయిస్తున్న ఆహార వ్యయం ఒక్కొక్కరికి రూ.80ను రూ.200కు పెంచాలని... ఆరోగ్యశాఖ గతంలోనే ప్రతిపాదించినా అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై తాజాగా నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది.