TELUGU FARMERS WORKSHOP: 'రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలన్న' లక్ష్యంతో తెలుగు రైతు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి 3రోజుల పాటు హనుమాన్ జంక్షన్లో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సదస్సు కోసం హనుమాన్ జంక్షన్లోని రాయల్ హంపి కల్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, గత మూడేళ్లుగా రైతాంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు, అన్నదాతల ఆత్మహత్యలు, రైతులకు గిట్టుబాటు ధర, ఆక్వా రంగ సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
WORKSHOP: జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తొలిరోజు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. వర్క్ షాపు ముగింపు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరై అన్నదాతలకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.