ఆన్‌లైన్ బెట్టింగ్‌లు.. ఆన్‌లైన్ లోన్‌లు జీవితాలను చిదిమేస్తున్నాయి. ప్రధానంగా యువత అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ఆన్‌లైన్ యాప్‌ల సంస్థలు డబ్బులు ఎరగా వేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే సులభంగా రుణాలు ఇస్తున్నారు. క్షణికావేశం.. తాత్కాలికంగా అవసరాలు తీరతాయనే ఉద్ధేశ్యంతో వెనకాముందు ఆలోచించకుండా డబ్బులు తీసుకుంటున్న వాళ్లు .. ఆ తర్వాత రుణం తీర్చలేక ప్రాణాలు పణంగా పెడుతున్నారు. పరువు పోయిందని తలెత్తుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ నెలలోనే ఇలా ముగ్గురు ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు బలయ్యారు.
ఒత్తిళ్లకు..
మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన శ్రావణ్ ఆన్‌లైన్ యాప్‌లో రూ.16 వేలు అప్పుగా తీసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ యువకుడు నగదు పోగొట్టుకున్నాడు.. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ఆన్‌లైన్ యాప్‌ల గాలానికి చిక్కాడు. చివరకు లోన్ తీర్చాలంటూ ఒత్తిళ్లు రాగా.. వాటిని తట్టుకోలేక శ్రావణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. లీగల్ నోటీస్ చూసి.. కుటుంబం పరువు పోతుందనే ఆవేదనతో తనువు చాలించాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
మనస్తాపంతో..
సిద్దిపేట జిల్లా రాజగోపాలపేటలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఆన్‌లైన్ అప్పు.. ఓ ఉద్యోగిని ప్రాణాలు తీసింది. గడువులోగా లోన్ డబ్బులు కట్టలేదని.. ఉద్యోగిని ఫోన్‌లోని నంబర్లన్నింటికీ వాట్సప్‌లో మెసేజ్ పంపారు. మనస్థాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె మౌనిక ఏఈవోగా పనిచేస్తోంది. తండ్రి వ్యాపారాల్లో నష్టపోవడం వల్ల కుటుంబ అవసరాల కోసం మౌనిక ‘స్నాప్ ఇట్ లోన్ ’యాప్ నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకుంది. గడువులోగా లోన్ డబ్బు చెల్లించలేదని ఆమె కాంటాక్ట్ నంబర్లన్నింటికీ డిఫాల్టర్ అంటూ యాప్ నిర్వాహకులు వాట్సప్ మేసేజ్‌లు పంపారు. మనస్తాపం చెందిన మౌనిక.. ఈ నెల 14న పురుగుల మందు తాగగా.. గాంధీలో చికిత్స పొందుతూ చనిపోయింది. మౌనిక సోదరుడి ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది.
పరువు పోతుందని..
రాజేంద్రనగర్ పరిధి కిస్మత్‌పూర్‌లోనూ ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్ ద్వారా అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్.. లాక్‌డౌన్ వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయాడు. ఇన్‌స్టంట్ క్రెడిట్ యాప్‌లలో రుణాలు తీసుకున్నాడు. యాప్ నిబంధనలు అంగీకరించాడు. సెల్‌ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ యాప్ వాళ్లకు చేరగా.. రుణం చెల్లించలేదని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ వివరాలు పంపించారు. పరువు పోయిందని భావించిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
లోన్‌లే కాకుండా ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకొని అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా.. వాటిని నియంత్రించడంలో విఫలమవడం విమర్శలకు తావిస్తోంది.
ఇవీచూడండి:తాతయ్య ఇంటికి చేరకుండానే తనువు చాలించిన చిన్నారి