లంచాలు, వసూళ్లే కాకుండా కరెంటు వినియోగం యూనిట్ల రీడింగ్ నమోదు, బిల్లుల వసూలులోనూ కొందరు ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజా తనిఖీల్లో ఇలా మీటర్ రీడింగ్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముగ్గురు విద్యుత్ సహాయ ఇంజినీరు(ఏఈ)లను సస్పెండ్ చేస్తూ దక్షిణ తెలంగాణ ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ఏఈ శ్రీనివాస్, ఆపరేషన్స్ విభాగం ఏఈ అర్జున్, మొయినాబాద్ ఏఈ తిరుపతిరెడ్డిలను సస్పెండ్ చేశారు. వీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమల యూనిట్లకు కొత్తగా కరెంటు కనెక్షన్ ఇచ్చారు. కానీ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండా వదిలేయడంతో వేలాది యూనిట్ల కరెంటును అక్రమంగా వాడుకున్నట్లు తనిఖీల్లో ఉన్నతాధికారులు గుర్తించారు. నిర్లక్ష్యంగా వదిలేశారా? లేక లంచాలు తీసుకుని కావాలనే రీడింగ్ తీయడం లేదా? అనేది తేల్చేందుకు డిస్కం విచారణ చేపట్టింది. ఇలా ముగ్గురు ఏఈ స్థాయి అధికారులను ఒకేసారి సస్పెండ్ చేయడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. నగరంలోని చిత్రపురి కాలనీలో భారీ భవనం నిర్మిస్తూ అక్రమంగా కరెంటు వాడుకుంటున్నా పట్టించుకోనందుకు ఇద్దరు లైన్‌మెన్‌లపై వేటు వేయాలని ఆ ప్రాంత డీఈని డిస్కం ఆదేశించింది. ఇకముందు ఇలాంటివి జరిగితే డీఈపైనా వేటు వేస్తామని హెచ్చరించింది.
SUSPENSION: తెలంగాణలో ముగ్గురు విద్యుత్ ఏఈల సస్పెండ్...ఇద్దరు లైన్‌మెన్‌లపై వేటు
విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల అవినీతి, వసూళ్లు, నిర్లక్ష్యం వ్యవహారాలపై యాజమాన్యాలు కఠిన చర్యలు ప్రారంభించాయి. "ప్రతిపనికీ పైసలివ్వాల్సిందే!" శీర్షికతో శనివారం "ఈనాడు, ఈటీవీ భారత్"లో వచ్చిన కథనంపై సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావును వివరణ అడిగారు. దాంతో వెంటనే డిస్కంలలో అవినీతికి పాల్పడినట్లు తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిస్కంల సీఎండీలకు సూచించారు.
తెలంగాణలో ముగ్గురు విద్యుత్ ఏఈల సస్పెండ్...ఇద్దరు లైన్‌మెన్‌లపై వేటు
సమస్యలపై ఫిర్యాదులకు యాప్:కరెంటు సరఫరా అకస్మాత్తుగా నిలిపివేయడం, ఇతర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో తీసుకునేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ‘వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక’(సీజీఆర్‌ఎఫ్)కు ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. ఈ యాప్‌ను సోమవారం ఈఆర్‌సీ కార్యాలయంలో ప్రారంభిస్తామని చెప్పారు.