తెలంగాణలో కుంభవృష్టి వర్షాలతో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా మునిగాయి. పలు ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే అతి భారీ వర్షాలు పడటం వల్ల మొలక, చిన్న మొక్కల దశలో ఉన్న పంటలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకూ రికార్డు స్థాయిలో 39, ఆసిఫాబాద్‌లో 30, నిర్మల్ జిల్లా సారంగాపూర్‌లో 21, లక్ష్మణచాందాలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వాతావరణశాఖ లెక్కల ప్రకారం 24 గంటల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షం కురిస్తే అత్యంత భారీ వర్షంగా పరిగణిస్తారు. ఈ స్థాయి వర్షాలతో అప్పటికప్పుడు వచ్చే వరదలకు మొక్కల స్థాయిలో ఉండే పైర్లు నిలబడలేవని, వర్షపు నీటిలో మునిగితే దెబ్బతింటాయని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపుతోటల్లో నీరు నిలవడంతో పాడయ్యాయి. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలకు నష్టం ఎక్కువగా ఉంది.
పైరులో 33 శాతానికిపైగా దెబ్బతిందని గుర్తిస్తే..
వరదలు, తుపాన్లు, కరవు వంటి విపత్తులతో పంటలు దెబ్బతింటే వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో విచారించి అంచనాలు రూపొందించాలి. ప్రతీ రైతు వివరాలు నమోదు చేయాలి. పైరులో 33 శాతానికిపైగా దెబ్బతింటే నష్టంగా పరిగణించి కేంద్రానికి నివేదిక పంపాలి. ఆ నష్టాలను కేంద్రం గుర్తిస్తే ఎకరానికి రూ.10 వేల దాకా పెట్టుబడి రాయితీ వస్తుంది. కానీ రాష్ట్రంలో వ్యవసాయశాఖ లెక్కలు సేకరించడం లేదు. ఎన్ని ఎకరాల్లో పంటలు నీట మునిగాయి, ఎందరు రైతులు ఎంత నష్టపోయారనే వివరాలను అడిగితే వ్యవసాయశాఖ కార్యదర్శి, కమిషనర్ రఘునందన్‌రావు సమాధానం ఇవ్వలేదు.
పంట నష్టాలను లెక్కించాలని కమిషనర్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున తాము పొలాలకు వెళ్లి చూడటం లేదని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు’కు చెప్పారు. కొన్ని జిల్లాల్లో వ్యవసాయాధికారులతో మాట్లాడితే ప్రాథమిక అంచనా అంటూ మౌఖికంగా చెబుతున్నారు. ఈ మౌఖిక లెక్కల వల్ల రైతులకు పరిహారంగా కేంద్రం నుంచి పెట్టుబడి రాయితీ ఏమీ రాదు. అది రావాలంటే ఒక రైతు ఎన్ని ఎకరాల్లో.. ఏ సర్వే నంబర్లో.. ఎంత పంట వేశారు... అందులో ఎంత శాతం దెబ్బతింది అనేది వివరంగా ఉండాలి. ఆధార్‌నంబరు, బ్యాంకు ఖాతాతో సహా సమగ్రంగా సేకరించాలి. ఇలాంటి వివరాలు సేకరించాలని ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ నష్టం..
* కుమురం భీం జిల్లాలో దాదాపు 43,600 ఎకరాల పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.
*జగిత్యాల జిల్లాలోని రాయికల్, కోరుట్ల, మల్లాపూర్, జగిత్యాల, సారంగాపూర్, కథలాపూర్, బీర్పూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 64 గ్రామాల్లో 1,639 మంది రైతులకు చెందిన 2,791 ఎకరాల్లో పంటలు నీట మునినట్లు జిల్లా అధికారులు తెలిపారు. వీటిలో 1,883 ఎకరాల వరి ఉంది. ఈ పంటలన్నీ 33 శాతానికి పైగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.
* ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో 50 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.
* సిద్దిపేట జిల్లాలో 140 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు చెప్పారు.
నీటిని బయటకు పంపాలి..