ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘తోటపల్లి’కి రద్దు సెగ?.. మిగిలిన పనుల నిలిపివేత - thotapalli project latest news

తోటపల్లి ప్రాజెక్టు ద్వారా పూర్తి ప్రయోజనాలు నెరవేరక ముందే, ఆశించిన ఆయకట్టుకు నీరందించక ముందే పనులకు స్వస్తి చెప్పడంతో దాని భవితవ్యం ఏమిటనే చర్చ సాగుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారమే.. ఇంకా రూ.300 కోట్లకు పైగా పనులు చేయాల్సి ఉంది. ఇవి రద్దు పద్దులో చేరడంతో భవిష్యత్తులో ధరలు పెరిగిపోయి మరింత భారమయ్యే అవకాశముందని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. గుత్తేదారులతో పరస్పర అంగీకార నిబంధన మేరకు జల వనరులశాఖ పనుల ఒప్పందాలను ఇటీవల రద్దు చేసుకుంది. ముందస్తు రద్దు ఒప్పందాల్లో భాగంగా ఇప్పుడు నిలిపివేసిన పనులు మళ్లీ ఐదేళ్ల పాటు చేపట్టకూడదంటూ ఆర్థికశాఖ షరతు విధించడంతో ఈ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి.

thotapalli
thotapalli

By

Published : Nov 12, 2020, 7:13 AM IST

ఉత్తరాంధ్రలో నాగావళి నదిపై విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించేలా తోటపల్లి బ్యారేజీ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 64వేల ఎకరాల స్థిరీకరణ, 1,31,224 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం లక్ష్యాలు. అవి ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు రెండు ప్యాకేజీల్లో పనులు జరుగుతుండగానే జల వనరులశాఖ వాటిని రద్దు పద్దులో చేర్చింది. గుత్తేదారులతో పరస్పర అంగీకార ప్రాతిపదికన రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులూ వెలువడ్డాయి.

20% పనులు మిగిలే ఉన్నాయి

తోటపల్లి బ్యారేజీ నిర్మాణం పూర్తయి నీళ్లిస్తున్నా ప్రాజెక్టులో ఇంకా 20% పైగా పనులు మిగిలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టును రూ.1,127.58 కోట్లతో చేపట్టగా.. ఇప్పటివరకూ రూ.800 కోట్ల పనులే చేశారు.

* ఒకటో ప్యాకేజీలో అదనపు ఆయకట్టుకు నీరిచ్చేలా అదనపు డిస్ట్రిబ్యూటరీలు, కుడి ప్రధాన కాలువకు స్లూయిస్‌ల ఏర్పాటు వంటివి చేయాలి.
* ప్రధాన కాలువలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, ఫీల్డు ఛానళ్ల పనులు చేయాలి.
* మరో ప్యాకేజీలో తోటపల్లి కుడి కాలువ 97.7వ కిలోమీటరు నుంచి గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్లే పనులు, గడిగడ్డ దాటిన తర్వాత 15వేల ఎకరాలకు నీరందించే పనులు చేయాలి.
* డిస్ట్రిబ్యూటరీ పనులకు ఇంకా 293 ఎకరాల భూమి సేకరించాలి.
* జలాశయంలో+105 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా పునరావాస పనులు చేయాలి.
* శ్రీకాకుళం జిల్లాలో 161ఎకరాలు, విజయనగరం జిల్లాలో 90.47ఎకరాలు సేకరించాలి.
* భూసేకరణపై న్యాయస్థానాల్లో రెండు కేసులు పెండింగులోఉన్నాయి. ఈ కారణాలతో పనులు ఆలస్యం అవుతుండటంవల్ల ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు జల వనరులశాఖ చెబుతున్నా.. మళ్లీ పట్టాలెక్కాలంటే ఎన్నేళ్లు పడుతుందో, అప్పటికి అంచనాలు ఎంత పెరిగిపోతాయో అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఇదీ చదవండి:

ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అరెస్ట్ చేస్తారా..?- హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details